
మంచిర్యాల: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై మంత్రి సీతక్క హాట్ కామెంట్స్ చేశారు. మంగళవారం (మే 13) మంచిర్యాల జిల్లా జన్నారంలో ఆదివాసీ కార్యకర్తల శిక్షణ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా హాజరైన ఆమె మాట్లాడుతూ.. ఆదివాసీలు, దళితులకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమన్నారు. అటవీ భూముల మీద ఆదివాసీలకు హక్కులు కల్పించింది కాంగ్రెస్ అని పేర్కొన్నారు. కానీ గనుల కోసం బీజేపీ అడవులను లూటీ చేస్తోందని.. కార్పొరేట్లకు కట్టబెట్టడానికి కుట్రలు చేస్తోందని విమర్శించారు.
గనులపై ఆదివాసీలకు హక్కులుంటాయని తెలిపారు. దేశం కోసం పోరాటం చేసిన నెహ్రు, అంబేద్కర్ మార్గంలో కాంగ్రెస్ నడుస్తోంటే.. గాంధీని చంపిన గాడ్సే మార్గంలో ఆర్ఎస్ఎస్ పయనిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దళితులను, ఆదివాసీలను మనువాదం బానిసలుగా చూస్తోందని మండిపడ్డారు. దళితులకు, ఆదివాసీలకు కాంగ్రెస్ స్వేచ్చ స్వాతంత్ర్యాలు ఇచ్చిందని పేర్కొన్నారు.