
- 2018లోనే మామకు వెన్నుపోటుప్లాన్ చేసిండు
- అందుకే అప్పట్లో ఆయనకుకేసీఆర్ మంత్రి పదవియ్యలే
- అధికారం పోంగనే తట్టుకోలేక ఆరోపణలు చేస్తున్నరు
- బీజేపీ హయాంలో ట్యాక్స్ టెర్రరిజం వచ్చిందని కామెంట్
కాగజ్ నగర్, వెలుగు: బీఆర్ఎస్ లో ఏక్ నాథ్ షిండే మాజీ మంత్రి హరీశ్ రావేనని పంచాయతీ రాజ్ మినిస్టర్, ఉమ్మడి ఆదిలాబాద్జిల్లా ఇన్చార్జ్మంత్రి సీతక్క అన్నారు. హరీశ్ రావు 2018లోనే ఎమ్మెల్యేలను పోగేసి మంతనాలు చేశారని, అందుకే అప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా కేసీఆర్ పక్కనపెట్టారని చెప్పారు. శనివారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హరీశ్ రావు రాజీనామా పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రూ. లక్ష కోట్లు దోపిడీ చేసిన కేసీఆర్, హరీశ్ రావు.. ఇప్పుడు తమను రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం చూస్తే జాలి కలుగుతోందన్నారు. తమకు పాలన చేతకాదని, ఊర్లల్లో నీళ్ళు రావడం లేదని బీఆర్ఎస్ నాయకులు బద్నాం చేస్తున్నారని అన్నారు. మిషన్ భగీరథలో పూర్తిగా క్వాలిటీ లేని పైపులు వేయడం వల్లే అవి పగిలిపోతున్నయని, వాటిని రిపేర్ చేసేందుకు టైమ్ పడుతోందన్నారు. దీనికి తమ నిర్లక్ష్యమే కారణమని గగ్గోలు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు.
ఒక ఆదివాసీ మహిళ మంత్రిగా ఎదగడం ఓర్వలేకనే.. తన శాఖను టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి గురించి అడిగితే బీజేపీ రాముడి పేరుతో కాలక్షేపం చేస్తోందన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం ఉన్నది అదానీ, అంబానీల కోసమేనన్నారు. బీజేపీ పాలనలో ట్యాక్స్ టెర్రరిజం వచ్చిందన్నారు. ఆదిలాబాద్ లోక్ సభ సెగ్మెంట్లో కాంగ్రెస్ నిలబెట్టిన ఆత్రం సగుణనే గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆదిలాబాద్ జడ్పీ మాజీ చైర్మన్ సిడం గణపతి, సిర్పూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ రావి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.