హైదరాబాద్, వెలుగు: ‘రైజింగ్ తెలంగాణ’ లక్ష్య సాధనలో భాగం కావాలని ఆస్ట్రేలియాలోని పలు కంపెనీల ‘ఇండియన్’ సీఈవోలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. పెట్టుబడులు పెట్టి రాష్ట్ర పురోగతిలో పాలు పంచుకోవాలని కోరారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా శనివారం ఆయన.. సిడ్నీలో 'ది సెంటర్ ఫర్ ఆస్ట్రేలియా – ఇండియా రిలేషన్స్’ ఆధ్వర్యంలో నిర్వహించిన బిజినెస్ కాంక్లేవ్ లో పాల్గొన్నారు.
తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి అనుకూలించే అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉందని తెలిపారు. అంతర్జాతీయ పెట్టుబడులకు తెలంగాణ అత్యంత సురక్షితమైన గమ్యస్థానంగా మారిందన్నారు.
దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టు ‘ఇండస్ట్రీ రెడీ వర్క్ ఫోర్స్’ ను అందించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. ఏఐ, డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్, గేమింగ్, యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్, సెమీకండక్టర్లు, ఏరోస్పేస్, డిఫెన్స్, అడ్వాన్డ్స్ మాన్యుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ, ఈవీల తయారీ తదితర రంగాల్లో తెలంగాణలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో 'ది సెంటర్ ఫర్ ఆస్ట్రేలియా – ఇండియా రిలేషన్స్’ చైర్ పర్సన్ స్వాతి దవే, ‘ఆస్ట్రేలియా – ఇండియా’ బిజినెస్ కౌన్సిల్ నేషనల్ అసోసియేట్ చైర్మన్ ఇర్ఫాన్ మాలిక్, ఈటీపీఎల్ డైరెక్టర్ సౌరవ్ బెనర్జీ తదితరులు పాల్గొన్నారు.
