గ్లోబల్ సిటీగా ఫ్యూచర్ సిటీ..ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణం: మంత్రి శ్రీధర్బాబు

గ్లోబల్ సిటీగా ఫ్యూచర్ సిటీ..ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణం: మంత్రి శ్రీధర్బాబు
  • జూన్ ​2 లేదా 3న సీఎం చేతుల మీదుగా ఎఫ్ సీడీఏ ఆఫీస్ ను ప్రారంభిస్తాం
  • ఆటుపోట్లను అధిగమిస్తూ ముందుకుసాగుతాం: మంత్రి పొంగులేటి 
  • ఎఫ్ సీడీఏ ఆఫీస్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రులు

హైదరాబాద్, వెలుగు: ఫ్యూచర్​సిటీ డెవలప్​మెంట్ అథారిటీ (ఎఫ్ సీడీఏ) ఆఫీస్ ను సీఎం రేవంత్​చేతులు మీదుగా జూన్​ 2 లేదా 3న ప్రారంభిస్తామని ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్​బాబు తెలిపారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును భవిష్యత్​లో గ్లోబల్​సిటీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకుసాగుతోందన్నారు. గురువారం రెవెన్యూ, హౌసింగ్​శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఫ్యూచర్​సిటీలో నిర్మిస్తున్న ఎఫ్​సీడీఏ ఆఫీస్​ను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్​బాబు మాట్లాడుతూ ప్రస్తుతం వేస్తున్న పునాదులపై రాబోయే రోజుల్లో ఆధునిక నిర్మాణాలు వెలిసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలోనే ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపే నగరంగా ఫ్యూచర్ సిటీ ఎదగాలన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. ఇప్పటికే పోలీస్ కమిషనరేట్ ఏర్పాటుతోపాటు గ్లోబల్ ప్రెజెన్స్ కలిగిన ప్రభుత్వ కార్యాలయాలను కూడా ఇక్కడి నుంచే నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. 

ఫ్యూచర్​ సిటీ ప్రతిష్ఠాత్మకం: పొంగులేటి 

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫ్యూచర్​సిటీని నిర్మిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆటుపోట్లు అధిగమిస్తూ.. సమస్యలను పరిష్కరిస్తూ సానుకూల దృక్పథంతో ముందుకుసాగుతున్నామని పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ దేశానికే తలమానికంగా నిలిచేలా రూపుదిద్దుకుంటుందని, ఈ ప్రాజెక్ట్ ద్వారా లక్షలాది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు.

నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రస్తుతం తాత్కాలిక క్యాంపస్​లో కొనసాగుతున్న యూనివర్సిటీకి శాశ్వత క్యాంపస్ నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయని, పనుల పురోగతిని సమీక్షించి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామని వివరించారు. వారి వెంట ఫ్యూచర్​ సిటీ డెవలప్‌‌‌‌మెంట్ అథారిటీ కమిషనర్​ కె.శశాంక, మహేశ్వరం డీసీపీ కె.నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.