- కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ సామాన్యుడికి చేరువ చేయాలన్నదే మా తపన
- ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026’లో మంత్రి ప్రసంగం
న్యూఢిల్లీ, వెలుగు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటం కంప్యూటింగ్, బ్లాక్ చెయిన్ లాంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీలను సామాన్యుడికి చేరువ చేసి.. డిజిటల్ గవర్నెన్స్‌లో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా తీర్చి దిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
‘తెలంగాణ రైజింగ్ 2047’లక్ష్య సాధనలో టెక్నాలజీని కేవలం ఓ సాఫ్ట్‌వేర్‌గా మాత్రమే కాకుండా.. ఓ ట్రాన్స్‌ఫార్మేషన్ టూల్‌గా మార్చుకుంటున్నామని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్–2026’లో శుక్రవారం ‘ఏజెంట్స్ ఆఫ్ ఛేంజ్: ఏఐ ఫర్ గవర్నమెంట్ సర్వీసెస్ అండ్ క్లైమేట్ రెసిలియెన్స్’అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని, మాట్లాడారు.
పౌర సేవలకు టెక్నాలజీని అనుసంధానం చేసి.. ప్రభుత్వానికి, పౌరులకు మధ్య ఉండే దూరాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. భారత్ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, ఏఐ యూనివర్సిటీ, ఐకాం(ఏఐకేఏఎం), ఏఐ ఆధారిత తెలంగాణ డిజిటల్ ఎక్స్ఛేంజ్, భూ భారతి లాంటి విప్లవాత్మక సంస్కరణలు డిజిటల్ గవర్నెన్స్‌లో తెలంగాణ బ్రాండ్‌ను సుస్థిరం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
సాంకేతిక ఫలాలను అందరికీ చేరువ చేసేలా ‘ఏజెంటిక్ ఏఐ’వినియోగంపై దృష్టి సారించామన్నారు. టెక్నాలజీని వ్యవసాయం, వాతావరణ మార్పులు, ఆరోగ్యం, సుస్థిర నగరాల అభివృద్ధి, క్లీన్ ఎనర్జీ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ తదితర రంగాలకూ విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
తెలంగాణ అవకాశాల గని..
తెలంగాణ అవకాశాల గని అని, అపారమైన టాలెంట్ పూల్ తమ బలం అని శ్రీధర్ బాబు అన్నారు. స్వీడెన్ ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏఐ వల్ల ఎదురయ్యే సవాళ్లను, అది తీసుకొచ్చే అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ‘‘ఏఐ విస్తృతితో ఉద్యోగ డ్యూటీల్లో మార్పులు వస్తాయి. అందుకు అవసరమైన సన్నద్దతను మా ప్రభుత్వం మొదలుపెట్టింది.
స్కిల్లింగ్, రీ స్కిల్లింగ్ అనేది రెండేండ్లుగా మేం మంత్రంలా జపిస్తున్నాం. ప్రభుత్వ సేవలు, సంక్షేమ కార్యక్రమాల్లో ఏఐ వినియోగం వల్ల కనెక్టివిటీ పెరుగుతుంది. నూతన ఆవిష్కరణలు చేపట్టేందుకు గ్లోబల్ టెక్ కంపెనీలు ముందుకు రావాలి”అని పిలుపునిచ్చారు. పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం లాంటిదని, దీనికి అనుకూలమైన ఎకో సిస్టంను రాష్ట్రంలో అభివృద్ధి చేశామని, నిరంతర విద్యుత్తు సరఫరా అమలు చేస్తున్నట్లు తెలిపారు.
