ఇన్నొవేషన్ హబ్గా తెలంగాణ : మంత్రి శ్రీధర్ బాబు

ఇన్నొవేషన్ హబ్గా తెలంగాణ : మంత్రి శ్రీధర్ బాబు
  • ఐటీ ఎలక్ట్రానిక్స్​తో పాటు ఫార్మా,
  • డిఫెన్స్, ఏవియేషన్​లకూ హైదరాబాద్​ కీలకం: మంత్రి శ్రీధర్​ బాబు
  • కాస్మోపాలిటన్​ జీవనశైలితో అందరికీ సొంతూరు అనే ఫీలింగ్​
  • జర్మనీ ప్రతినిధుల బృందంతో సమావేశం

హైదరాబాద్, వెలుగు: ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో హైదరాబాద్​ను ఇన్నొవేషన్​ హబ్​గా తీర్చిదిద్దామని ఐటీ, ఇండస్ట్రీస్​ శాఖ మంత్రి శ్రీధర్​ బాబు చెప్పారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలతో పాటు ఫార్మా, డిఫెన్స్, ఏవియేషన్​ పరిశ్రమలకూ హైదరాబాద్​ కీలకమైన వేదికగా నిలుస్తున్నదని.. ఆవిష్కరణలు, పెట్టుబడులకు గ్లోబల్ హబ్ గా ఎదుగుతున్నదని చెప్పారు.

బ్రిక్స్ దేశాల్లో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులకు అనువైన వాతావరణం, ఆధునిక సాంకేతికతల ప్రభావంపై అధ్యయనం చేయడానికి రాష్ట్రానికి వచ్చిన జర్మనీ డెలిగేట్స్.. శుక్రవారం సెక్రటేరియెట్​లో మంత్రి శ్రీధర్​ బాబును కలిశారు. గ్లోబల్ బ్రిడ్జెస్ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. తెలంగాణలో ఉన్న పారిశ్రామిక అవకాశాలు, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలపై మంత్రి వారితో చర్చించారు.

మారుతున్న ప్రపంచ పరిస్థితులకు తగ్గట్టుగా సవాళ్లను ఎదుర్కొనేందుకు వినూత్న విధానాలను అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ముందంజలో ఉందని వారికి వివరించారు. పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా, నీటి లభ్యతలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. భౌగోళికంగా దేశం నడిబొడ్డున హైదరాబాద్​ ఉండడంతో ఏడాది పొడవునా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందన్నారు.

అంతేగాకుండా విభిన్న సంస్కృతుల వాళ్లు ఇక్కడ ఉంటారని, కాస్మోపాలిటన్ జీవనశైలితో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే వారికి ‘సొంత ఊరు’ అనే భావన కలిగిస్తోందని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్​ సిటీ దక్షిణ భాగంలో ప్రతిష్టాత్మక ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును వేగంగా రూపొందిస్తున్నామని మంత్రి శ్రీధర్​ బాబు తెలిపారు. ఇందులో భాగంగా ఏర్పాటవుతున్న ఏఐ సిటీ, నెట్ జీరో సిటీ, యంగ్​ ఇండియా స్కిల్స్​ యూనివర్సిటీ వంటి ప్రాజెక్టులు రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయని అన్నారు.

తెలంగాణలో అపారమైన మానవ వనరులు, టాలెంట్ పూల్ అందుబాటులో ఉండటంతో పరిశ్రమలకు నిపుణుల కొరత తలెత్తే సమస్యే ఉండదని స్పష్టం చేశారు. జర్మనీ సాంకేతికత తోడైతే ఇంజినీరింగ్ రంగంలో తెలంగాణ మరింత ముందుకు దూసుకెళ్తుందని చెప్పారు. ఈ సమావేశంలో జర్మన్ ప్రతినిధి బృందం సభ్యులు స్టెఫాన్ ట్రేగర్, క్రిస్టియన్ అల్టెన్ హోఫెన్, ఫ్రాంక్ బీర్ హోస్ట్, అలెగ్జాండర్ వాన్ క్రామ్, మాల్టె హొహ్ ఫీల్డ్, ఫిలిప్ మేయర్ హోఫర్, మ్యాక్స్ మిల్లన్ వ్యాన్ లెయర్ తదిరులు పాల్గొన్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి కూడా హాజరయ్యారు.