రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో తీసుకొచ్చిన ఈజ్​ఆఫ్​డూయింగ్​ బిజినెస్​ విధానాలతో ఇండస్ట్రీల ఏర్పాటుకు దేశంలో ఎక్కడా లేనంత అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​ బాబు అన్నారు. మలేషియా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు హాజరైన మంత్రి.. ఆదివారం అక్కడి పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా వారిని కోరారు. 

మలేషియా, ఇండియా మధ్య వ్యాపార సంబంధాలు మరింత బలపడాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. రెండు దేశాల సంస్కృతుల్లో ఎన్నో పోలికలున్నాయని, దీంతో పరస్పర సహకారం అందించుకోవడం మరింత సులభమవుతుందని చెప్పారు. పెట్టుబడులు పెట్టేందుకు ఇండియాకు వచ్చే వాళ్లందరికీ హైదరాబాద్​ ఎంట్రీ పాయింట్​గా ఉంటున్నదని చెప్పారు. డిసెంబర్​లో ఓసారి రాష్ట్రానికి రావాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని శ్రీధర్​బాబు హామీ ఇచ్చారు. 

సోనియా, రాహుల్, ఖర్గే ప్రోత్సహించారు..

 అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని, నవంబర్​ 10తో 25 ఏండ్లు పూర్తి చేసుకున్న విషయం మిత్రులు చెప్పేదాకా గుర్తులేదని మంత్రి శ్రీధర్​ బాబు అన్నారు. రెండున్నర దశాబ్దాల తన రాజకీయ ప్రస్థానంలో సోనియా గాంధీ, రాహుల్​ గాంధీ, మల్లికార్జునఖర్గే ఎంతో ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సహించారన్నారు. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. తనపై నలుగురు ముఖ్యమంత్రులూ ఎంతో ఆదరాభిమానాలు చూపించారని పేర్కొన్నారు.

వ్యవసాయ రంగానికి  చేయూత

తెలంగాణలో వ్యవసాయ రంగానికి చేయూతనిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మలేషియాలో జరిగిన బిజినెస్ మీట్​కు మంత్రి శ్రీధర్ బాబు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, సాట్ చైర్మన్ శివసేనా రెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ అల్దాస్ జానయ్య, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి హాజరయ్యారు. 

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు బిజినెస్ మీట్​లో తెలంగాణలోని వ్యవసాయ అభివృద్ధిని వివరించారు. తెలంగాణలో సాగు చేస్తున్న వరి, ధాన్యం రకాలు, నాణ్యత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ బియ్యాన్ని తాము దిగుమతి చేసుకుంటామని దిగుమతిదారులు హామీ ఇచ్చారు.