లారీ ఓనర్లు, డ్రైవర్ల సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

లారీ ఓనర్లు, డ్రైవర్ల సమస్యలను పరిష్కరిస్తాం:  మంత్రి శ్రీనివాస్ గౌడ్

రంగారెడ్డి జిల్లా: బీజేపీ నాయకులు కావాలనే మునుగోడు ఉప ఎన్నికను తీసుకొచ్చారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. జిల్లాలోని తుర్కయంజాల్ మున్సిపాలిటీ మన్నెగూడలో నిర్వహించిన లారీ ఓనర్స్, డ్రైవర్ల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. లారీ ఓనర్లు, డ్రైవర్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఒకప్పుడు లారీ ఉందంటే ఆ వ్యక్తికి సమాజంలో చాలా గౌరవం దక్కేదని గుర్తు చేశారు. కానీ నేడు పదుల సంఖ్యలో లారీలున్నా.. లారీ ఓనర్లకు దక్కాల్సినంతా గుర్తింపు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందరికో ఉపాధినిస్తున్న లారీ ఓనర్లను గౌరవించాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వంలో జిల్లాకో డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేశామని చెప్పారు. 

తెలంగాణను ఆగం చేయాలనే కుట్రతోనే మునుగోడు ఎన్నిక..

అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయాలనే దురుద్దేశంతోనే బీజేపీ మునుగోడు ఉప ఎన్నికకు కుట్రలు పన్నిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్ట్ కోసమే బీజేపీలో చేరారని, ఆయన స్వార్ధం వల్లే మునుగోడు ఎన్నిక వచ్చిందని విమర్శించారు. మునుగోడు ఎన్నిక వల్ల అక్కడి ప్రజలకు ఇబ్బందులే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పారు. జాతీయ రాజకీయాల్లోకి రాకుండా బీఆర్ఎస్ ను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. రాష్ట్రానికి కాబోయే సీఎం కేటీఆర్ అని పేర్కొన్న మంత్రి... కేటీఆర్ సీఎం అయ్యాక రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. లారీ ఓనర్లు, డ్రైవర్లు మునుగోడులో టీఆర్ఎస్ కే మద్దతు పలుకుతున్నారని, అక్కడ గెలిచేది తమ అభ్యర్థేనని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.