హెచ్సీఏ వ్యవహారంపై ప్రారంభమైన సమీక్షా సమావేశం

హెచ్సీఏ వ్యవహారంపై ప్రారంభమైన సమీక్షా సమావేశం

భారత్  – ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ టికెట్ల అమ్మకం వ్యవహారంలో హెచ్సీఏ తీరుపై సమీక్షా సమావేశం ప్రారంభమైంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో భేటీ జరుగుతోంది. దీనికి హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, స్పోర్ట్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానీయాతో పాటు ఇతర శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. టికెట్ల విక్రయం విషయంలో హెచ్ సీఏ వ్యవహరించిన తీరు, జింఖానా గ్రౌండ్స్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంపై సమావేశంలో చర్చిస్తున్నారు. 

మరోవైపు జింఖానా గ్రౌండ్స్లో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో టికెట్ల విక్రయాలను నిలిపేశారు. టికెట్ కౌంటర్లు క్లోజ్ చేసిన అధికారులు క్రికెట్ అభిమానుల్ని అక్కడి నుంచి పంపివేశారు. మ్యాచ్ టికెట్లను సాయంత్రం ఆన్ లైన్ లో పెడతామని చెప్పారు. ఇదిలా ఉంటే టికెట్ల విక్రయం విషయంలో హెచ్ సీఏ నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేలాది మంది క్రికెట్ అభిమానులు తరలి వస్తారని తెలిసినప్పటికీ బోర్డు అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తొక్కిసలాడ జరిగిందని డీవైఎఫ్ఐ ఆరోపించింది.