‘కాకతీయ వైభవ సప్తాహం’ పై కేటీఆర్ సమీక్ష

‘కాకతీయ వైభవ సప్తాహం’ పై కేటీఆర్ సమీక్ష

హైదరాబాద్:  జులై 7 నుంచి వారం రోజలు పాటు కాకతీయ రాజుల వైభవాన్ని చాటి చెప్పేందుకు ‘కాకతీయ వైభవ సప్తాహం’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లపై సోమవారం ప్రగతి భవన్‌లో వారు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మేధావులు, కవులు, సాహితీవేత్తలు,  అన్ని వర్గాల ప్రజలను గౌరవించే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. కాకతీయ రాజుల వైభవాన్ని చాటిచెప్పేలా ... రాజకీయాలకు అతీతంగా కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు. 

అన్ని రంగాలకు చెందిన వ్యక్తులు భాగస్వాములు అయ్యేలా సాహితీ, సాంస్కృతిక, కళా కార్యక్రమాలను, మేధో చర్చలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వరంగల్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా, పండుగ వాతావరణం నెలకొనేలా విద్యుత్ దీపాలతో అలంకరించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖలను భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు  తెలిపారు. చీప్ విప్ వినయ్ భాస్కర్, ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా, టూరిజం కార్పొరేషన్ ఎండీ మనోహర్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.