హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు పంటల కొనుగోళ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వమే భారీ స్థాయిలో కొనుగోళ్లు చేపట్టేందుకు సీఎం ఆమోదం తెలిపారన్నారు.
రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, మార్కెట్ ధరలను స్థిరీకరించడం, రైతు ఆదాయాన్ని రక్షించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. యాసంగి 2025-=26 సీజన్‌లో రాష్ట్రంలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం 16.13 లక్షల ఎకరాల్లో జరగగా, మొత్తం దిగుబడి 42.87 లక్షల టన్నులకు చేరిందన్నారు. రైతులకు కనీస మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే రూ.4,172.94 కోట్ల గ్యారంటీ ఇచ్చిందని, అదనంగా మరో 6.53 లక్షల టన్నుల కొనుగోలుకు రూ.1,867.77 కోట్ల బ్యాంకు గ్యారంటీకి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు.
ఇప్పటివరకు 2.33 లక్షల మంది రైతుల నుంచి 12.85 లక్షల టన్నుల మక్కలు సేకరించినట్లు వెల్లడించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేండ్లలో మొక్కజొన్న కొనుగోళ్లకు రూ.5,063 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని, తమ ప్రభుత్వం ఈ ఒక్క యాసంగి సీజన్‌లోనే దాదాపు రూ.6,000 కోట్లు వెచ్చిస్తోందని తెలిపారు.
రూ.1,100 కోట్లతో జొన్నల కొనుగోళ్లు..
జొన్న (హైబ్రిడ్) కొనుగోళ్ల విషయంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.1,100 కోట్లతో కొనుగోళ్లు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని తుమ్మల వెల్లడించారు. రాష్ట్రంలో 4.03 లక్షల ఎకరాల్లో జొన్న సాగు జరిగిందని, 4.03 లక్షల టన్నుల ఉత్పత్తి అంచనా ఉన్నట్లు తెలిపారు. జిల్లాల వారీగా కొనుగోలు సెంటర్ల ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు.
గత ప్రభుత్వం పదేండ్లలో జొన్న కొనుగోళ్ల కోసం రూ.374 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా, తమ ప్రభుత్వం గత సీజన్‌లోనే దాదాపు రూ.800 కోట్లతో కొనుగోళ్లు చేపట్టిందని తెలిపారు. పొద్దుతిరుగుడు పంటను కేంద్ర ప్రభుత్వం కేవలం 25 శాతం కొనుగోళ్లకే అనుమతించిందని, అయితే రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పరిమితికి మించి కొనుగోళ్లు చేపట్టాలని సీఎం రేవంత్ ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర పూల్ ద్వారా అదనంగా 10,175 టన్నుల కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.
