- మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు
- నర్మెట పామాయిల్ ఫ్యాక్టరీని పరిశీలించిన మంత్రులు
సిద్దిపేట, వెలుగు: రైతులు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునేందుకు పంట మార్పిడి చేసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పేర్కొన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో ప్రారంభానికి సిద్ధమైన పామాయిల్ ఫ్యాక్టరీని మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారి అత్యాధునిక టెక్నాలజీతో నర్మెటలో నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీని ఈ నెల 22న సీఎం ప్రారంభిస్తారని తెలిపారు.
అదే రోజు రూ.40 కోట్లతో ఆయిల్ రిఫైనరీ యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం, భూగర్భజలాలు, మద్దతు ధర, సన్న వడ్లకు బోనస్ ఇవ్వడంతో వరి సాగులో రాష్ట్రం ముందుందని తెలిపారు. చీడ, పీడలు, అడవి పందులు, కోతులు, వడగండ్ల వానలతో ఇబ్బంది లేకుండా స్థిరమైన ఆదాయాన్ని సమకూర్చే ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని కోరారు. తాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో టన్ను రూ.12 వేలు ఉన్న ధర ఇప్పుడు రూ.21,546కు చేరిందని చెప్పారు. రూ.25 వేలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 20 లక్షల ఎకరాలు ఆయిల్ పామ్ సాగుకు అనుకూలంగా ఉందన్నారు. రాష్ట్రానికి సెంట్రల్ పాయింట్ లో ఉన్న సిద్దిపేటలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణంతో అన్ని ప్రాంతాలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఈ ప్రాంత రైతులు ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించాలని సూచించారు. ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, కలెక్టర్ కె హైమావతి, సిద్దిపేట ఆర్డీవో సదానందం, డీఏవో స్వరూపారాణి, ఆయిల్ ఫెడ్ అధికారులు సుధాకర్ రెడ్డి, శ్రీకాంత్ పాల్గొన్నారు.
