పోలవరం - నల్లమల సాగర్కు ఒప్పుకోం : మంత్రి ఉత్తమ్

పోలవరం - నల్లమల సాగర్కు ఒప్పుకోం : మంత్రి ఉత్తమ్
  • ఏపీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాం: మంత్రి ఉత్తమ్ 
  •     ధాన్యం సేకరణలో దేశంలోనే తెలంగాణ టాప్ 
  •     మూడేండ్లలో సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తాం: మంత్రి తుమ్మల 
  •     రైతులపై రాజకీయం మానుకోవాలని బీఆర్ఎస్ పై ఫైర్ 

భద్రాద్రి కొత్తగూడెం/అశ్వారావుపేట/దమ్మపేట/కోదాడ, వెలుగు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరిపై చేపడుతున్న పోలవరం–నల్లమల సాగర్ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకమని ఇరిగేషన్, సివిల్ సప్లయ్స్ శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్​రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అన్ని విధాల పోరాడుతున్నామని, సుప్రీంకోర్టులోనూ రిట్ పిటిషన్ వేశామని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట అగ్రికల్చర్ కాలేజీలో శుక్రవారం జరిగిన రైతుమేళాలో అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వర్ రావుతో పాటు మంత్రి ఉత్తమ్ పాల్గొన్నారు. 

కార్యక్రమంలో వ్యవసాయ యాంత్రీకరణ స్కీం, ప్రకృతి వ్యవసాయ పథకాలను  మంత్రులు ప్రారంభించారు. జిల్లాలోని 350 మంది రైతులకు రూ. 1.07 కోట్ల వ్యవసాయ యంత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. రూ. 100 కోట్లతో 1.31లక్షల మందికి యాంత్రీకరణ పథకాన్ని అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఒకే సీజన్ లో 70 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు సేకరించడం ద్వారా తెలంగాణ ధాన్యం సేకరణలో దేశంలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. కాగా, తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాను సాధించి తీరుతామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన కోదాడలో ప్రెస్ మీట్ లో మాట్లాడారు. 

కృష్ణా నీటి పంపకాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు 34 శాతం (299 టీఎంసీలు ), ఏపీకి 66 శాతం (512 టీఎంసీలు) అంగీకరించడం వల్ల ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలు నష్టపోయాయన్నారు. పాలమూరు–-రంగారెడ్డి, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కొడంగల్-–నారాయణపేట, డిండి, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులనూ గత సర్కారు పూర్తి చేయలేదని.. తాము మూడేండ్లలో ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు.   

10 లక్షల ఎకరాలకు నీళ్లిస్తాం 

సీతారామ ప్రాజెక్టును మూడేండ్లలో పూర్తి చేస్తామని,10 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. నాలుగో పంప్ హౌస్ పూర్తి అయితే అశ్వారావుపేట, దమ్మపేట మండలాలకు నీళ్లు వస్తాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో వ్యవసాయ యాంత్రీకరణ స్కీం తిరిగి ప్రారంభిస్తున్నామని, ఇది సంక్రాంతి తర్వాత రాష్ట్రమంతటా అమలవుతుందన్నారు. 

అంతకుముందు దమ్మపేట మండలం గండుగులపల్లిలోని సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ ను మంత్రులు ఉత్తమ్, తుమ్మల పరిశీలించారు.  కాగా, రైతు సంక్షేమం పేరుతో రాజకీయాలు చేయడం మాను కోవాలని బీఆర్ఎస్ నేతలకు మంత్రి తుమ్మల ఓ ప్రకటనలో హితవు పలికారు.  

బీఆర్ఎస్ హయాంలో ఎరువుల కోసం రైతులు క్యూలైన్లలో నిలబడి మరణించిన విషయాలను బీఆర్ఎస్ నేతలు మరిచారా? అని ప్రశ్నించారు. తాము రైతుబంధును రూ.6 వేలకు పెంచామని, రెండేళ్లలో రైతు సంక్షేమం కోసం రూ.1,05,000 కోట్లను ఖర్చు చేశామన్నారు. ఈ యాసంగి సీజన్‌లో రైతులు 4.60 లక్షల టన్నుల యూరియా కొన్నారని తెలిపారు. మొదటి ఏడాదిలోనే రూ.100 కోట్ల పరిహారం అందించామని, రెండో ఏడాదికి రూ.275 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇచ్చామన్నారు.