తెలంగాణ రైతాంగాన్ని, ఇరిగేషన్ ను కేసీఆర్ సర్వనాశనం చేశారు: ఉత్తమ్

 తెలంగాణ రైతాంగాన్ని, ఇరిగేషన్ ను కేసీఆర్ సర్వనాశనం చేశారు: ఉత్తమ్

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైరయ్యారు. ఇరిగేషన్ రంగంలో కేసీఆర్ చేసిన దోపిడీ దేశంలో ఎవరూ చేయలేదన్నారు. ఆదివారం జనగామ, సూర్యపేట జిల్లాలో కేసీఆర్ పర్యటించారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శస్తూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు.  నిన్న కేసీఆర్ అన్ని అబద్దాలే మాట్లాడారని మండిపడ్డారు. 

గాంధీ భవన్ లో ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ..  బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రైతులకు పంట బీమా కల్పించలేదని.. .దేశంలో పంట బీమా కల్పించని ఏకైక సర్కార్ బీఆర్ఎస్ దేనని విమర్శించారు. వరదలు, కరువుతో పంట నష్టపోతే.. ఒకటి రెండు చోట్లకు వెళ్లి కేసీఆర్ డ్రామా చేశాడని.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేద దుయ్యబట్టారు. మైక్ పనిచేయకుంటే కరెంట్ పోయిందంటూ కేసీఆర్ అబద్దాలు మాట్లాడారని.. పవర్ విషయంలో బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు. 24 గంటల పవర్ పాలసీని కొనసాగిస్తున్నాం.. రాష్ట్రంలో పవర్ కట్స్ లేవని స్పష్టం చేశారు.

కాళేశ్వరం గురించి మాట్లాడటానికి కేసీఆర్ కు సిగ్గుండాలి. తలదించుకోవాలి.. ముందు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు మంత్రి. కాళేశ్వరంలో కమిషన్ల కోసం అంచనాలు పెంచారని చెప్పారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్పిందే కేసీఆర్ అని నిప్పులు చెరిగారు. కేసీఆర్, జగన్ దోస్తీతో తెలంగాణకు అన్యాయం జరిగిందని.. కృష్ణా నుంచి జగన్ అక్రమంగా నీళ్లను తరలిస్తున్నా కేసీఆర్ నోరు మెదపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారాయన. 

ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ హయాంలోనే ఏపీకి ఎక్కువ నీళ్లు తరలి వెళ్లాయన్నారు ఉత్తమ్.  కేసీఆర్ భయాందోళనలో ఉన్నాడు.. అందుకే పొలం బాట పట్టారని చెప్పారు.  కేసీఆర్ పొంకనాలకు పోయి పార్టీని నాశనం చేశాడని విమర్శించారు. బీఆర్ఎస్ పదేళ్లలోనే కుప్పకూలిందని.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగవుతుందని మంత్రి ఉత్తమ్ చెప్పారు.