
- చివరి దశలో ఉన్న ప్రాజెక్టులను ముందుగా పూర్తి చేయండి
- అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం
- ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి పనులు
- పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తయితే 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు
- ఇందుకోసం రూ.8 వేల కోట్లు అవసరం.. ఈసారి బడ్జెట్లో
- రూ.11 వేల కోట్లు అదనంగా కేటాయించాలని ప్రపోజల్స్
- గత ప్రభుత్వం ప్రాజెక్టులపై చేసిన
- అప్పులకే ఏటా రూ.18 వేల కోట్ల వడ్డీలు కడుతున్నామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు రూట్‌మ్యాప్ రూపొందించామని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ‘‘పెండింగ్ ప్రాజెక్టులను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించాం. ఇప్పటికే పనులు ప్రారంభమై చివరి దశలో ఉన్న వాటిని ఏ కేటగిరీలో పెట్టాం. వీటిని సత్వరమే పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లిచ్చేలా చర్యలు తీసుకోవాలి’’ అని అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి లేదా డిసెంబర్ కల్లా పెండింగ్‌లో ఉన్న ప్రధాన ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలని చెప్పారు.
అదనపు నిధులు సమీకరించుకోవడం ద్వారా ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి, మరో 6.50 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. ఇటీవల మహబూబ్‌నగర్ పర్యటనలో భాగంగా 2025 డిసెంబర్ నాటికి ఆ జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం విధించారని గుర్తు చేశారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులతో పాటు రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులపై బుధవారం హైదరాబాద్ లోని జలసౌధలో అధికారులతో ఉత్తమ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కృష్ణా బేసిన్‌లోని పాలమూరు–రంగారెడ్డి, కొడంగల్–నారాయణపేట లిఫ్ట్స్కీమ్ తో పాటు పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు, డిండి, ఎస్ఎల్బీసీ, రాజోలిబండ లిఫ్ట్ఇరిగేషన్స్కీమ్, గోదావరి బేసిన్‌లోని చిన్న కాళేశ్వరం, సీతారామ, పింప్రి, సదర్మట్, నీల్వాయి, పాలెం వాగు, మత్తడి వాగు, ఎస్ఆర్ఎస్పీ ఫేజ్2, చనాకా కొరాట, లోయర్‌పెన్‌గంగ, దేవాదుల, మోదికుంట వాగు ప్రాజెక్టులపై చర్చించారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ‘‘ఏ కేటగిరీ ప్రాజెక్టులను రూ.240.66 కోట్లతో పూర్తి చేసి 47,882 ఎకరాల ఆయకట్టును సృష్టిస్తాం. ప్రస్తుతం పనులు కొనసాగుతున్న ప్రాజెక్టులకు రూ.7,500 కోట్లకు పైగా వ్యయం అవుతుంది. ఆయా ప్రాజెక్టుల ద్వారా 5,84,770 ఎకరాలకు నీళ్లందిస్తాం. ఈ నెలాఖరుకు నిర్మల్ జిల్లాలోని సదర్మట్ ప్రాజెక్టును సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారు. సీతారామ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రాజీవ్కెనాల్ను ఆగస్టు 15న సీఎం ఓపెన్ చేస్తారు” అని తెలిపారు. సదర్మట్ పెండింగ్ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
వడ్డీలకే రూ.18 వేల కోట్లు..
గత ప్రభుత్వ నిర్వాకం వల్ల ఇరిగేషన్ ప్రాజెక్టులపై చేసిన అప్పులకే రూ.18 వేల కోట్లు వడ్డీలు కడుతున్నామని ఉత్తమ్ తెలిపారు. ‘‘ఇరిగేషన్‌శాఖకు కేటాయించిన రూ.28 వేల కోట్లలో ఎక్కువ మొత్తం ప్రాజెక్టుల వడ్డీలకే పోతున్నది. మరో రూ.2 వేల కోట్లు జీతభత్యాలకు ఖర్చు చేస్తున్నాం. మిగతా రూ.8 వేల కోట్లతో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం కష్టం. ఈ నేపథ్యంలోనే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు మరో రూ.11 వేల కోట్లను బడ్జెట్లో కేటాయించాలని ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపుతున్నాం” అని చెప్పారు.
ఇచ్చంపల్లి బ్యారేజీపై అసెంబ్లీలో చర్చ..
ఇచ్చంపల్లి బ్యారేజీపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఉత్తమ్ తెలిపారు. ‘‘మేడిగడ్డ కుంగిపోవడం, మరమ్మతులు చేసినా గ్యారంటీ లేకపోవడంతో.. దాని స్థానంలో గోదావరి–కావేరి లింక్ద్వారా చేపట్టాలనుకుంటున్న ఇచ్చంపల్లి బ్యాక్వాటర్ద్వారా 195 టీఎంసీల నీళ్లను కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి ఇస్తామంటూ నేషనల్ వాటర్డెవలప్మెంట్అథారిటీ ప్రతిపాదించింది. దానిపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.
తుపాకులగూడెం వద్ద నిర్మించిన సమ్మక్క సాగర్ బ్యారేజీకి చత్తీస్గఢ్అభ్యంతరాలు చెప్తున్నది. ఆ రాష్ట్రంతో చర్చలు జరిపి ఒప్పిస్తాం” అని చెప్పారు. ఇరిగేషన్‌శాఖలో ప్రమోషన్ల ప్రక్రియపై న్యాయనిపుణుల సలహా తీసుకుంటామని పేర్కొన్నారు. ‘‘పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్ల ప్రక్రియను కచ్చితంగా పూర్తి చేస్తాం. వివాదాలుంటే చర్చలతో పరిష్కరిస్తాం. గత ప్రభుత్వం ఇరిగేషన్ శాఖను పునర్వ్యవస్థీకరించి డ్యామేజ్చేసింది. దీనిపై సమీక్షిస్తాం” అని తెలిపారు.
మేడిగడ్డపై ఫుల్ రిపోర్ట్ ఇవ్వండి
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డ్యామేజ్‌పై ఫుల్‌రిపోర్ట్ ఇవ్వాలని నేషనల్డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) చైర్మన్ అనిల్ జైన్‌ను మంత్రి ఉత్తమ్ కోరారు. ఎన్డీఎస్ఏ నివేదికపైనా మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఎన్డీఎస్ఏ చైర్మన్‌కు ఉత్తమ్ ఫోన్ చేసి మాట్లాడారు. ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదికకు అనుగుణంగా బ్యారేజీల రక్షణకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.
అన్నారం, సుందిళ్లలో జియోఫిజికల్, జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయని.. మేడిగడ్డలో వరద మొదలవడంతో ఆపామని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 20న ఢిల్లీలో ఎన్డీఎస్ఏ చైర్మన్‌తో భేటీ కావాలని ఉత్తమ్నిర్ణయించారు. పూర్తిస్థాయి నివేదికతో పాటు బ్యారేజీల పటిష్ఠతకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.