
- నల్సార్ వర్సిటీకి సహకారం అందిస్తం: మంత్రి ఉత్తమ్
- న్యాయశాఖ సూచనలను ప్రభుత్వం పరిశీలిస్తుంది
- నల్సార్ వర్సిటీలో క్యాపిటల్ ఫౌండేషన్ అవార్డుల ప్రదానోత్సవం
- హైకోర్టు సీజే అలోక్ అరాధేకు జస్టిస్ జేఎస్ వర్మ జాతీయ అవార్డు ప్రదానం
- సీనియర్ జర్నలిస్ట్ దిలీప్ రెడ్డికి ఎన్ సర్వోత్తమ్ రెడ్డి నేషనల్అవార్డు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ, దాని సంస్థలకు మౌలిక వసతులను బలోపేతం చేయడానికి పూర్తి సహకారం అందిస్తామని నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నల్సార్ వర్సిటీలో స్థానిక విద్యార్థులకు 20% రిజర్వేషన్‌ను ప్రవేశపెట్టామని చెప్పారు. స్థానిక విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండేలా చూడాలని వైస్ చాన్స్‌లర్‌ను కోరారు.
శనివారం నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లాలో క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ వార్షిక అవార్డులు, ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. క్యాపిటల్ ఫౌండేషన్ చైర్మన్, సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఏకే పట్నాయక్ అధ్యక్షత వహించారు. నల్సార్చాన్స్లర్, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జస్టిస్ ఏకే పట్నాయక్ ప్రారంభోపన్యాసం తర్వాత జస్టిస్ ఆర్. వెంకటరమణి టెక్నాలజీ, లా, హ్యుమానిటీ అనే అంశంపై ప్రసంగించారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ.. నల్సార్ వర్సిటీ దేశంలోనే అగ్రశ్రేణి న్యాయ పాఠశాలగా ఎదుగుతోందన్నారు. వర్సిటీ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
న్యాయవ్యవస్థను గౌరవిస్తాం
న్యాయశాఖ సూచనలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో 100 ఎకరాల స్థలంలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో హైకోర్టు సముదాయం రాబోతున్నదని చెప్పారు. ప్రజాస్వామ్యంలో కీలకమైన న్యాయ వ్యవస్థకు మద్దతుగా తెలంగాణ అంతటా అన్ని స్థాయిల్లో అద్భుతమైన కోర్టు సౌకర్యాలను నిర్మిస్తామని ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధేకు హామీ ఇచ్చారు. న్యాయ వ్యవస్థను అత్యంత గౌరవంగా చూడాలని, దాని సూచనలను, తీర్పులను స్వాగతిస్తున్నామని ప్రభుత్వ నిబద్ధతను మంత్రి పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో వచ్చిన సూచనలను సీఎం రేవంత్‌రెడ్డికి తెలియజేస్తానని తెలిపారు.
ఘనంగా అవార్డుల ప్రదానం..
క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ ఆధ్వర్యంలో పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, సంఘ సేవకులు, సంఘ సంస్కర్తలకు అవార్డులు ప్రదానం చేశారు. హైకోర్టు సీజే అలోక్ ఆరాధేకు.. జస్టిస్ జేఎస్ వర్మ జాతీయ అవార్డును ప్రదానం చేశారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీకి జస్టిస్ దీపాంకర్ ప్రసాద్ గుప్తా సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అవార్డును అందజేశారు.
గువాహటి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అజయ్ లాంబాకు జస్టిస్ పీఎన్ భగవతి జాతీయ అవార్డు, హైదరాబాద్ వర్సిటీ ప్రొఫెసర్ గోవర్ధన్ మెహతాకు డాక్టర్ అబ్దుల్ కలాం అవార్డు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పరాగ్త్రిపాఠికి కే వేణుగోపాల్ అటార్నీ జనరల్ జాతీయ అవార్డు, బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ఎస్.ఎస్.
నాగానంద్కు అటార్నీ జనరల్ కే పరాశరన్ అవార్డు, సీనియర్ జర్నలిస్ట్ దిలీప్‌రెడ్డికి ఎన్. నరోత్తమ్‌రెడ్డి జాతీయ అవార్డు, హెల్త్ కేర్ అండ్ ఎన్విరాన్మెంటల్ జస్టిస్ యాక్టివిస్ట్ డాక్టర్ అల్లాణి కిషన్‌రావుకు ఎన్విరాన్మెంట్అండ్హెల్త్కేర్నేషనల్అవార్డు, డిప్యూటీ కన్జర్వేటర్ఆఫ్ ఫారెస్ట్(రిటైర్డ్) డాక్టర్ కె.తులసీరావుకు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ నేషనల్అవార్డు, పరిశోధకుడు, ప్రచారకర్త, పర్యావరణ న్యాయ కార్యకర్త డాక్టర్ దొంతి నర్సింహారెడ్డికి డాక్టర్ శివాజీరావు అవార్డు, ఆచార్య నాగార్జున వర్సిటీ కామర్స్ అండ్మేనేజ్మెంట్ఫ్యాకల్టీ, మాజీ డీన్ ప్రొఫెసర్ రామినేని శివరామప్రసాద్ కు క్యాపిటల్ ఫౌండేషన్ జాతీయ అవార్డును ప్రదానం చేశారు.
నల్సార్ ఆన్లైన్ లా తెలుగు కోర్సు ప్రారంభం
ఈ కార్యక్రమం సందర్భంగా నల్సార్ వర్సిటీ నూతనంగా రూపొందించిన ఆన్లైన్ లా తెలుగు కోర్సులను మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అలాగే, తెలంగాణ హైకోర్టు సీజే అలోక్ అరాధే, జస్టిస్ లీలా సేథ్ రచించిన ‘‘వి, ది చిల్డ్రన్ ఆఫ్ ఇండియా, ది ప్రియాంబుల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్” పుస్తకాన్ని తెలుగులో విడుదల చేశారు. అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన వారికి న్యూఢిల్లీ క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ సెక్రటరీ జనరల్ డాక్టర్ వినోద్ ధన్యవాదాలు తెలిపారు