హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సహకార అభివృద్ధి సంస్థలకు కొత్తగా నియమితులైన చైర్మన్లు, వైస్ చైర్మన్లు ప్రజలకు సేవ చేస్తూ సంస్థల అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. సోమవారం పశుఅభివృద్ధి సంస్థ రాష్ట్ర చైర్మన్‌గా నియమితులైన డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్, మేకలు, గొర్రెల సహకార అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన కే. సరిత తిరుపతయ్య, కల్లుగీత సహకార అభివృద్ధి సంస్థ రాష్ట్ర వైస్ చైర్మన్ కే. నాగరాజ్ గౌడ్‌లు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా చైర్మన్లు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలన్నారు. తమకు కేటాయించిన సంస్థల బలోపేతానికి, అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని చైర్మన్లు, వైస్ చైర్మన్లకు తెలిపారు.
