బీసీల కోసం ఎంతవరకైనా వెళ్తం.. తీర్పు ఏం రాబోతుందో ఇప్పటికే అర్ధమైంది: మంత్రి వాకిటి శ్రీహరి

బీసీల కోసం ఎంతవరకైనా వెళ్తం.. తీర్పు ఏం రాబోతుందో ఇప్పటికే అర్ధమైంది: మంత్రి వాకిటి శ్రీహరి

హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల కోసం ఎంతవరకైనా వెళ్తామని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల వ్యవహారంపై బుధవారం (అక్టోబర్ 8) హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను రద్దు చేసి.. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ చేయకుండా స్టే ఇవ్వాలని పిటిషనర్ కోరారు. నోటిఫికేషన్ విడుదలపై స్టే ఇవ్వాలన్న పిటిషనర్ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. 

నోటిఫికేషన్ విడుదలపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి గాంధీ భవన్‎లో మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తరుఫున హైకోర్టులో బలంగా వాదనలు వినిపించామని చెప్పారు. ఈ కేసులో వాదనలు ముగిసే వరకు ఇలానే వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. బీసీల కోసం ఎంతవరకైనా పోరాడుతామని తేల్చిచెప్పారు.

హైకోర్టులో తీర్పు ఏం రాబోతుందో ఇప్పటికే అర్ధం అయ్యిందని.. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయనే విషయం ప్రజలకు అర్ధమైందని అన్నారు. మా న్యాయమైన వాటా కోసమే మేం కొట్లాడమన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే పేదొడి పార్టీ అని మరోసారి రుజువైందన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధిగా ఉన్నామని.. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే పార్టీ ఒక్క కాంగ్రెసేనని అన్నారు.