
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై ప్రభుత్వం తరుఫున హైకోర్టులో వాదనలు బలంగా వినిపిస్తామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పే హైకోర్టులో కూడా వస్తుందని ఆశిస్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్లపై బుధవారం (అక్టోబర్ 8) హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో ఈ అంశంపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చించేందుకు మంగళవారం (అక్టోబర్ 7) మంత్రి శ్రీహరి నివాసంలో మంత్రులు సమావేశమయ్యారు. బీసీ కోటా రిజర్వేషన్లపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. ఈ భేటీ అనంతరం మంత్రి వాకిటి శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ.. బీసీ జనాభా ప్రకారం కోటా దక్కాల్సిందేనని స్పష్టం చేశారు.
బీసీ కోటాపై కాంగ్రెస్ సర్కార్ చిత్తశుద్ధితో ముందుకుపోతుందని తెలిపారు. అసెంబ్లీలో బీసీ బిల్లులకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని గుర్తు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పించడం కోసం హైకోర్టులో వాదనలు బలంగా వినిపిస్తామని తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో సానుకూల తీర్పు వస్తుందని ఆశిస్తున్నానని ఆయన అన్నారు.