
మంచిర్యాల: చెన్నూరు నియోజకవర్గంలో ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కమీషన్లు వచ్చే పనులకే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రయారిటీ ఇచ్చాడని మంత్రి వివేక్ విమర్శించారు. సోమవారం (సెప్టెంబర్ 15) మందమర్రి బీ1 కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మందమర్రి మండల నాయకులు, కార్యకర్తలతో మంత్రి వివేక్ సమావేశమయ్యారు. గ్రామాలు, వార్డుల్లో నెలకొన్న సమస్యలు, జరుగుతున్న అభివృద్ధి పనులపై కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగం చేసి గత ఎమ్మెల్యే కమీషన్లు దండుకున్నాడని విమర్శించారు.
నియోజక వర్గంలోని మున్సిపాలిటీలు, గ్రామాల్లో ఎక్కడ చూసిన రోడ్లు, డ్రైనేజీ కాలువలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అమృత్ స్కీమ్ పథకం ద్వారా రూ.100 కోట్లతో క్యాతనపల్లి, చెన్నూరు, మందమర్రి మున్సిపాలిటీ ప్రజలకు ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు చేపట్టిన పనులు నత్తనడకన నడుస్తున్నాయన్నారు. పనులు స్పీడప్ చేయాలని అధికారులను ఆదేశించానని చెప్పారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 10 వేల 5 వందల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు.