
మంచిర్యాల: కేంద్ర ప్రభుత్వ జాప్యం చేయడం వల్లనే తెలంగాణలో యూరియా కొరత ఏర్పడిందని మంత్రి వివేక్ వెంటకస్వామి అన్నారు. మంగళవారం (సెప్టెంబర్ 16) మందమర్రి మండలం రామక్రిష్ణపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో మంత్రి వివేక్ సమావేశమయ్యారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులలో నెలకొన్న సమస్యలు, జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం క్యాతనపల్లి మున్సిపాలిటీలో రూ.40 కోట్లతో చేపట్టిన అమృత్ స్కీమ్ పథకం పనులను స్పీడప్ చేయాలని మున్సిపల్, పబ్లిక్ హెల్త్ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అనంతరం మంత్రి వివేక్ మాట్లాడుతూ.. చెన్నూరు నియోజక వర్గంలో యూరియా కొరత లేదని.. రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. యూరియా కొరత అంటూ బీఆర్ఎస్ నాయకులు అపోహలు సృష్టిస్తున్నారని.. రైతులు ఎవరు వాళ్ల మాటలు నమ్మొద్దని కోరారు.
ఎంపీగా ఉన్న సమయంలో రూ.10 వేల కోట్ల రుణమాఫీ చేయించి రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీని రీ ఓపెన్ చేయించానని గుర్తు చేశారు. ఫెర్టిలైజర్ ప్లాంట్లో సూపర్ వైజింగ్ నిర్వహణ లోపంతో 90 రోజుల బ్రేక్ డౌన్ వల్ల యూరియా ఉత్పత్తి నిలిచిపోయిందని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా గ్రామాలు, మున్సిపాలిటీల్లో మౌలిక వసతులు కల్పించే దిశగా కృషి చేస్తానని పేర్కొన్నారు.