ఆరు గ్యారంటీల అమలుతో  ప్రజాపాలన: మంత్రి వివేక్ వెంకటస్వామి

ఆరు గ్యారంటీల అమలుతో  ప్రజాపాలన: మంత్రి వివేక్ వెంకటస్వామి
  •     మా​ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నరు
  •     రాష్ట్ర ఏర్పాటు తర్వాత 17 లక్షల కొత్త రేషన్ కార్డులిచ్చినం
  •     ఆధిపత్యం కోసమే సర్కారుపై కేటీఆర్, హరీశ్ విమర్శలు
  •     యువత ఉద్యోగాల కోసం చేపట్టిన జపాన్ పర్యటన సక్సెస్ 
  •     వెయ్యిరోజుల పాలనపై  మంత్రి వివేక్ వెంకటస్వామి

న్యూఢిల్లీ, వెలుగు: ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి.. రాష్ట్రంలో ప్రజాపాలన అందిస్తున్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. తమ ప్రభుత్వ పథకాలతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. బుధవారం ఢిల్లీలోని పార్టీ హెడ్ ఆఫీస్ ఇందిరా భవన్ లో ‘తెలంగాణలో వెయ్యి రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన’పై ఆయన మాట్లాడారు. రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, సన్న బియ్యం వంటి ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారి 17 లక్షల కొత్త రేషన్ కార్డులు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కానీ, గత బీఆర్​ఎస్​ప్రభుత్వం దళిత సీఎం, డబుల్ బెడ్రూం ఇండ్లు, నిరుద్యోగ భృతి వంటి ఎన్నో హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో రెండు ఎన్నికల్లో గెలిచిన కేసీఆర్.. గద్దెనెక్కగానే ప్రజల్ని విస్మరించారని ఫైర్ అయ్యారు. కానీ, కాంగ్రెస్ సర్కార్ మాత్రం రెండున్నరేండ్లలోనే 4 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందని చెప్పారు.  

ఫ్రస్ట్రేషన్ లో కేటీఆర్ విమర్శలు..

తుగ్లక్ సీఎంగా కేసీఆర్ లక్ష పుస్తకాలు చదివి కాళేశ్వరం పేరుతో లక్ష కోట్ల ప్రజా ధనాన్ని వృథా చేశారని ఎద్దేవా చేశారు. కుటుంబ ఆధిపత్యం కోసమే కేటీఆర్, హరీశ్ రావు, కవిత కాంగ్రెస్ పార్టీ పై అనవసర విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ హయాంలో కాళేశ్వరం నుంచి తొలిసారి 60 టీఎంసీలు ఎల్లంపల్లికి పంపు చేశారని, తర్వాత పైన ఉన్న తుమ్మడిహెట్టి నుంచి నీళ్లు రావడంతో 60 టీఎంసీలు వృథాగా అయ్యాయన్నారు. ఇప్పుడు ఇలాగే నీళ్లను వృథాగా పంపు చేసి, తద్వారా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే కేటీఆర్, హరీశ్​రావు కాళేశ్వరంపై అసత్య ఆరోపణలు చేశారని చెప్పారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఫ్రస్ట్రేషన్ లోనే.. బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో విష ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కానీ, ఈ ఆరోపణలు, విమర్శలను తెలంగాణ సమాజం విశ్వసించడం లేదని చెప్పారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ‘కారు, సారు.. పదహారు’ నినాదంతో వెళ్లి సీట్లు తగ్గించుకున్నారని, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయారని, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో జీరో కు పడిపోయారని గుర్తు చేశారు. అలాగే, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి పాలయిందన్నారు. దీంతో కేటీఆర్ నాయకత్వంపై కేడర్ లో అనుమానం మొదలైందని చెప్పారు. 

జపాన్ కు నైపుణ్యమున్న యువత..

రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో చేపట్టిన తన జపాన్ పర్యటన సక్సెస్​అయిందని మంత్రి వివేక్ తెలిపారు. జపాన్ కంపెనీల్లో పెరుగుతున్న మానవ వనరుల కొరతను తీర్చేందుకు.. రాష్ట్రం నుంచి నిపుణులను అందించేందుకు పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఓవర్సీస్ మ్యాన్ పవర్  కంపెనీ లిమిటెడ్(టామా కామ్)ను ప్రధాన సంస్థాగత వేదికగా పనిచేస్తున్నట్టు వివరించారు. రాష్ట్ర యువతకు ఉన్నత అవకాశాలు కల్పించేలా.. ఈ ఏడాది ఏప్రిల్​లో తొలి పర్యటన జర్మనీలో చేపట్టి నట్టు తెలిపారు. ఐటీఐలపై సుమారు రూ.4 వేల కోట్లు ఇన్వెస్ట్ చేసి.. కొత్త కొత్త కోర్సులు అందిస్తున్నట్టు చెప్పారు. తద్వారా కొత్త ఉద్యోగాలు కల్పించవచ్చని చెప్పారు. మందమర్రిలో 70 మంది, సిటీలో వంద లాది మందికి జర్మనీ భాష నేర్చుకుంటున్నారని తెలిపారు. కొడంగల్​లోనూ త్వరలో జర్మనీ భాష నేర్పిం చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. స్థానిక భాష నేర్పించి ఉద్యోగాలు కల్పించే అంశంపై  జపాన్ పర్యటనలోనూ చర్చ జరిగిందన్నారు.