వేలాల గట్టు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా: మంత్రి వివేక్ వెంకటస్వామి

వేలాల గట్టు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • మల్లన్న ఆశీస్సులతో చెన్నూరు అభివృద్ధి: మంత్రి వివేక్ వెంకటస్వామి 
  • గట్టు మల్లన్న కొండపైకి నడిచివెళ్లి ప్రత్యేక పూజలు
  • వేలాలగట్టు, కత్తెరశాల మల్లికార్జునస్వామి ఆలయాల్లో వివేక్, సరోజ దంపతుల ప్రత్యేక పూజలు

కోల్​బెల్ట్/జైపూర్/చెన్నూరు, వెలుగు: వేలాల గట్టు మల్లన్న స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. మల్లికార్జునస్వామి ఆశీస్సులతో చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తున్నట్లు చెప్పారు. ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి సరోజ దంపతులు జైపూర్ మండలం గట్టు మల్లన్న, చెన్నూరు మండలం కత్తెరశాలలోని మల్లికార్జున స్వామి జాతరలో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు. 3 కిలోమీటర్ల దూరంలోని గట్టు మల్లన్న కొండపైకి నడుచుకుంటూ వెళ్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణకుంభం, కళాకారులు ఒగ్గుడోలు చప్పుళ్లతో ఘనస్వాగతం పలికారు. ఆలయాల కమిటీ సభ్యులు మంత్రికి తీర్థప్రసాదాలు అందజేసి శాలువాతో సత్కరించారు.

పూజల అనంతరం భక్తులను పలకరించి శివరాత్రి శుభాకాంక్షలు చెప్పారు. ఆ తర్వాత చెన్నూరులో సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ర్యాలీలో మంత్రి పాల్గొని, మాట్లాడారు. మహాదేవుడి దయతో ప్రజలంతా సుఖ, సంతోషాలతో ఉండాలని, మంచి వర్షాలు కురిసి సమృద్ధిగా పాడి పంటలు పండాలని కోరుకున్నట్లు చెప్పారు. తాను ఎమ్మెల్యే అయ్యాక వేలాల గట్టు మల్లన్నస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. లక్షలాది భక్తులు జాతరకు వస్తారని, తాను 15ఏండ్లుగా స్వామివారిని దర్మించుకుంటున్నానని తెలిపారు. గట్టు మల్లన్న క్షేత్రంలో తాగునీటి సౌకర్యం కోసం రెండు సోలార్ బోర్లను, హైమాస్ట్​ లైట్లను ఏర్పాటు చేశామన్నారు.

టీటీడీ తరహాలో లగేజీ సిస్టం..
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈసారి కూడా వీఐపీ, ఇతర వెహికల్స్‌‌ను గుట్టపైకి అనుమతించలేదని మంత్రి వివేక్‌‌ వెంకటస్వామి అన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగినవారికి, వృద్ధులు,పిల్లలకు ప్రత్యేక వెహికల్స్ అందుబాటులో ఉంచామని చెప్పారు. ఆలయం రిజర్వు ఫారెస్ట్‌‌లో ఉండటంతో అభివృద్ధి కార్యక్రమాలకు ఫారెస్ట్ అనుమతులు రావడం లేదన్నారు. అటవీ పర్మిషన్లు కోసం ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.

స్వామి వారిని దర్శంచుకోవడానికి కాలినడకన వస్తే సంతృప్తి ఉంటుందన్నారు. ప్రతి నెల ఆరుద్ర నక్షత్రంలో గట్టుమల్లన్న గిరి ప్రదక్షిణ ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. తిరుమల- తిరుపతి తరహాలో వేలాది మంది భక్తులకు లగేజీ సిస్టం అమలు సాధ్యాసాధ్యాలపై పరిశీలిస్తున్నామని చెప్పారు. కత్తెరశాల మల్లికార్జునస్వామి ఆలయ అభివృద్ధికి రూ.80 లక్షలు కేటాయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. బంజారాల అభివృద్దికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.