- ఈఎస్‌ఐలో పేషెంట్లకు ట్రీట్‌మెంట్‌లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: వివేక్ వెంకటస్వామి
- కార్మికులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం
- నాచారం ఆస్పత్రిలో సీటీ స్కాన్, ఆర్సీపురంలో ఐసీయూ ఏర్పాటుకు ఓకే
- రెండు నెలల్లో పనులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశం
హైదరాబాద్, వెలుగు:ఈఎస్‌ఐ ఆసుపత్రులకు వచ్చే ఇన్ పేషెంట్లు (ఐపీలు), వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేయాలని, విధుల్లో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని మంత్రి వివేక్ వెంకటస్వామి హెచ్చరించారు. ఆసుపత్రుల్లో కార్మికుల సంక్షేమానికే అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని, అందుకు తగ్గట్టుగా మౌలిక వసతులు, మందుల కొరత లేకుండా చూడాలన్నారు.
కార్మికులకు మెరుగైన వైద్యం అందించడంలో భాగంగా మౌలిక వసతుల కల్పనపై మంత్రి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నాచారం ఈఎస్‌ఐ ఆసుపత్రిలో సీటీ స్కాన్ సదుపాయం, ఆర్సీపురం ఈఎస్‌ఐ ఆసుపత్రిలో ఐసీయూ ఏర్పాటుకు పచ్చజెండా ఊపారు. వీటికి సంబంధించిన పనులను రెండు నెలల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం నుంచి ఈఎస్‌ఐ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ఈఎస్‌ఐ సొసైటీకి రావాల్సిన పెండింగ్ నిధులను రప్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
బుధవారం సెక్రటేరియెట్‌లోని తన చాంబర్‌లో ఈఎస్‌ఐ ఆసుపత్రుల పనితీరుపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి మాట్లాడారు. ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది కలిపి సుమారు 600 మంది నియామకాల కోసం ఇప్పటికే ప్రతిపాదనలను మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు పంపినట్లు వెల్లడించారు. ఈ నియామక ప్రక్రియ వేగవంతమయ్యేలా ఎప్పటికప్పుడు బోర్డుతో సంప్రదింపులు జరపాలని అధికారులను ఆదేశించారు.
సింగరేణి ఏరియాలో కొత్త డిస్పెన్సరీ..
మంచిర్యాల జిల్లాలో కార్మికులు అధికంగా ఉన్న మందమర్రి లేదా ఆర్‌కేపురం ప్రాంతాల్లో కొత్తగా ఈఎస్‌ఐ డిస్పెన్సరీ ఏర్పాటు చేయాలని మంత్రి వివేక్ నిర్ణయించారు. దీని కోసం అవసరమైన స్థల పరిశీలన (సైట్ సర్వే) వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్థలం కోసం సింగరేణి సంస్థతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో ఆటంకాలు ఉండకూడదని, మందుల కొనుగోళ్లలో పూర్తి పారదర్శకత పాటిస్తూ నిబంధనల ప్రకారమే ముందుకెళ్లాలని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా సిబ్బంది తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా.. వాటిని పరిష్కరించాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. పరిపాలనాపరమైన చిక్కులు రోగుల సేవలకు అడ్డంకిగా మారకూడదని, ఆసుపత్రుల్లో జవాబుదారీతనంతో కూడిన పని సంస్కృతి రావాలని మంత్రి వివేక్ అన్నారు. ఈ సమావేశంలో కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్, వివిధ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, సీనియర్ డాక్టర్లు పాల్గొన్నారు.
