- జపనీస్ భాష కూడా నేర్పిస్తున్నం: మంత్రి వివేక్
- జపాన్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తం
- డిసెంబర్ 7–9 గ్లోబల్ సమిట్‌కు రండి
- జపాన్ ఇన్వెస్టర్లకు మంత్రి వివేక్ విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగాలు పొందేలా రాబోయే ఐదేండ్లలో 45 లక్షల మందికి అత్యాధునిక నైపుణ్య శిక్షణ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని శక్తి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ప్రపంచ పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా యువతను గ్లోబల్ స్కిల్స్ లో తీర్చిదిద్దుతున్నామని అన్నారు.
రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. జపాన్ పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా స్థానిక యువతకు సాంకేతిక నైపుణ్యాలతో పాటు జపనీస్ భాషలోనూ శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. జపాన్ పని సంస్కృతిలోని కచ్చితత్వం, సమయపాలన, క్రమశిక్షణ, అంకితభావం వంటి విలువలను యువత అలవర్చుకుంటే అక్కడి ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని పేర్కొన్నారు.
సోమవారం సచివాలయంలో జపాన్‌లోని హిరోషిమా ప్రిఫెక్చర్ ప్రభుత్వ ప్రతినిధుల బృందంతో మంత్రి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. గతంలో హిరోషిమా పర్యటన సందర్భంగా జరిగిన చర్చలను గుర్తుచేస్తూ.. తెలంగాణ, హిరోషిమా మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని అన్నారు.
లాంగ్‌టర్మ్ పార్ట్‌నర్‌షిప్ లక్ష్యం
నైపుణ్య మానవ వనరుల మార్పిడి, పరిశ్రమలకు అవసరమైన శిక్షణ, అంతర్జాతీయ ఉపాధి కల్పనలో హిరోషిమా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని మంత్రి తెలిపారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా జరిగే ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ కార్యక్రమానికి హిరోషిమా ప్రతినిధులను ఆహ్వానించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, పారదర్శక విధానాలను వివరించారు.
జపాన్ పెట్టుబడిదారులకు అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి, గ్లోబల్ ఎంప్లాయ్‌మెంట్ రంగాల్లో పరస్పర ప్రయోజనాలతో కూడిన దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని నిర్మించడమే లక్ష్యమని చెప్పారు. ఈ సమావేశంలో సీఎస్ సంజయ్ జాజు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా, పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఇంధన శాఖ కార్యదర్శి హరిచందన, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, టీజీఐఐసీ ఎండీ శశాంక, ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణ రెడ్డి, టామ్‌కామ్ ఎండీ కాంతి వెస్లీ, ఇతర అధికారులు, హిరోషిమా ప్రతినిధులు పాల్గొన్నారు.
