తెలుగు పాటలకు కేరాఫ్ సుశీలమ్మ : మంత్రి వివేక్ వెంకటస్వామి

తెలుగు పాటలకు కేరాఫ్ సుశీలమ్మ : మంత్రి వివేక్ వెంకటస్వామి
  •     ‘క్రౌన్ ఆఫ్ ది మ్యూజిక్’ అవార్డు ప్రకటించిన మంత్రి వివేక్
  •     రవీంద్రభారతిలో సిల్వెల్ సినీ సుస్వరాల ప్రోగ్రామ్
  •     విజయలక్ష్మికి ‘ఘంటసాల మ్యూజిక్’ అవార్డు ప్రదానం

బషీర్​బాగ్, వెలుగు: తెలుగు పాటలకు కేరాఫ్ అడ్రస్ గాన కోకిల పి.సుశీల అని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో శృతిలయ ఫౌండేషన్, సిల్వెల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ‘సిల్వెల్ సినీ సుస్వరాలు 80’ కార్యక్రమం సోమవారం రవీంద్రభారతిలో నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్​కు చీఫ్ గెస్ట్​గా మంత్రి వివేక్ హాజరయ్యారు. సుశీలమ్మకు ‘క్రౌన్ ఆఫ్ ది మ్యూజిక్’ అవార్డు ప్రకటించారు. 

ప్రముఖ నేపథ్య గాయని విజయలక్ష్మికి ‘ఘంటసాల మ్యూజిక్ అవార్డు 2026’, ఫొటోగ్రాఫర్ యాదగిరి గౌడ్​కు ‘ఉత్తమ ప్రతిభ అవార్డు’ను ప్రదానం చేశారు. అనంతరం మంత్రి వివేక్ మాట్లాడారు. ‘‘ఇటీవల నా విదేశీ పర్యటనలో సుశీల కుటుంబ సభ్యులు కలిశారు. అనారోగ్యం కారణంగా సుశీలమ్మ రాలేకపోయారని కుటుంబ సభ్యులు చెప్పారు. కల్చరల్ యాక్టివిటీస్​తో మనిషి ఉత్సాహంగా ఉంటారు. చదువుకునే రోజుల్లో నేను కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనేవాడిని. రెగ్యులర్, బిజీ లైఫ్​లో ఇలాంటి కార్యక్రమాలు అవసరం’’అని వివేక్ అన్నారు. 

పేద, మధ్య తరగతి పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్

కాకా అంబేద్కర్ విద్యాసంస్థల ద్వారా డొనేషన్లు లేకుండా పేద, మధ్య తరగతి పిల్లలకు విద్యను అందిస్తున్నామని మంత్రి వివేక్ తెలిపారు. ‘‘80 శాతం పైగా మార్కులు సాధిస్తే ఉచిత విద్య అందిస్తున్నం. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. ఈ నెల 17న జింఖాన గ్రౌండ్స్​లో ఫైనల్ మ్యాచ్ ఉంది. వెంకటస్వామి ఫౌండేషన్, విశాక ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. 

ఫ్రీ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ పరంగా క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలకు విశాక ఇండస్ట్రీస్ ఎప్పుడూ సహకారం అందిస్తుంది’’అని వివేక్ తెలిపారు. నవరస గాయని ఆమని ఆధ్వర్యంలో పలు గాయని, గాయకులు సుశీల పాడిన చిత్ర గీతాలు ఆలపించి వీక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్, రాష్ట్ర సగర గౌరవ అధ్యక్షుడు ముత్యాల హరికృష్ణ, ఆదర్శ ఫౌండేషన్ కుసుమ భోగరాజు, శృతిలయ వ్యవస్థాపక కార్యదర్శి ఆమని తదితరులు పాల్గొన్నారు.