హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు అంశంపై శుక్రవారం జరిగే కేబినెట్ సమావేశంలో చర్చిస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. గురువారం హైదరాబాద్లో సీపీఎస్ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వాల శ్రీకాంత్ నేతృత్వంలోని ఆ సంఘం ప్రతినిధి బృందం మంత్రిని మర్యాదపూర్వంగా కలిసింది. ఈ సందర్భంగా సీపీఎస్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
గత 22 ఏండ్లుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల సొమ్ము దాదాపు రూ.20 వేల కోట్లు షేర్ మార్కెట్‌లో మగ్గుతున్నాయని యూనియన్ నాయకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రిటైర్ అయిన ఏ ఒక్క ఉద్యోగికి కూడా కనీస పెన్షన్ రూ.9,500 కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 5 వేల మందికి పైగా రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్ లేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. సీపీఎస్ విధానం రద్దుతో ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం ఉండదని వారు పేర్కొన్నారు.
కాగా, సీపీఎస్ఈయూ నేతల వినతిపై మంత్రి వివేక్ వెంకటస్వామి సానుకూలంగా స్పందించారు. సమస్య తీవ్రతను అర్థం చేసుకున్న ఆయన.. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. కేబినెట్ భేటీలో సీపీఎస్ రద్దు అంశంపై చర్చించేలా చూస్తానని, ఉద్యోగులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎస్ఈయూ నేతలు శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు.
