ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : వివేక్ వెంకటస్వామి

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : వివేక్ వెంకటస్వామి
  • కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలతో మమేకం కావాలి
  • జీహెచ్‌‌ఎంసీ ఎన్నికల్లోపార్టీ గెలిచేందుకు కష్టపడాలని సూచన
  • రహమత్ నగర్‌‌‌‌లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ కార్యకర్తలు నిత్యం ప్రజలతో కలిసిపోయి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయాలని, అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని గనులు, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. శనివారం హైదరాబాద్‌‌ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్ బూత్ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొని, మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని, వీటిని కాంగ్రెస్ కార్యకర్తలు ఎప్పటికప్పుడు జనంలోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

 ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ కార్యకర్తలు ముందుండాలని కోరారు. వర్షంలో సైతం బూత్ కమిటీ మీటింగ్‌‌కు ఇంతపెద్ద సంఖ్యలో కార్యకర్తలు రావడం ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలాన్ని చాటిచెబుతోందన్నారు. కాంగ్రెస్ బలోపేతానికి ఈ నియోజకవర్గంలో ఒక్కో బూత్ కమిటీకి 20 మంది ముఖ్య కార్యకర్తలను ఎంపిక చేసుకొని రహమత్ నగర్ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. రానున్న ఉప ఎన్నికలో, ఆ తర్వాత జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక మెజార్టీతో గెలిచేందుకు ఇప్పటి నుంచే కష్టపడి పనిచేయాలని వివేక్ పిలుపునిచ్చారు. 

సమస్యలు పరిష్కరిస్తా..

రహమత్ నగర్‌‌‌‌లో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించే బాధ్యత తనదేనని మంత్రి వివేక్‌‌ చెప్పారు. ఇక్కడ అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇప్పిస్తామని, ఇండ్లు లేని పేదలకు డబుల్ బెడ్‌‌రూంలను మంజూరు చేస్తామన్నారు. సొంత స్థలం ఉన్న వారు ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షలు మంజూరు చేస్తామని చెప్పారు. ఇక్కడి ప్రజల సౌకర్యార్థం కమ్యూనిటీ హాల్ మంజూరుకు చర్యలు తీసుకుంటానని, నాలా సమస్యను పరిష్కరిస్తామని, సీసీ రోడ్లను నిర్మించేందుకు అవసరమైన నిధులను మంజూరు చేయిస్తానని, మహిళల కోసం అదనపు బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. 

ఇక్కడ హై టెన్షన్ లైన్ల సమస్యను జీహెచ్‌‌ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరిస్తానని చెప్పారు. గతంలో ఇక్కడ వడ్డెరలకు జీవనోపాధి కోసం కేటాయించిన భూమిని తిరిగి వారికి దక్కేలా మైనింగ్ అధికారులతో విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రహమత్ నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ బూత్ కమిటీ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.