సొంత చెల్లె కవిత, బావ హరీశ్ రావు, తండ్రి కేసీఆర్ ఫోన్లను కూడా కేటీఆర్ ట్యాపింగ్ చేశారని ఆరోపించారు మంత్రి వివేక్ . ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా ఫోన్ ట్యాపింగ్ చేశారని మండిపడ్డారు. చెన్నూరు మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి శంకుస్థాపన చేశారు. సుమారు కోటి 25 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం మాట్లాడిన ఆయన.. కేటీఆర్ కేసీఆర్ రిటైర్డ్ పోలీస్ అధికారులతో ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ కుంభకోణాల్లో కోట్ల రూపాయల దండుకొని పేద ప్రజల నడ్డి విరిచారని విమర్శించారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎనికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు వివేక్..
చెన్నూరు మున్సిపాలిటీనీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు వివేక్. సుమారు 500 కోట్ల నిధులతో మున్సిపాలిటీలో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ పనులు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో కోల్ బ్లాక్ టెండర్ లలో అక్రమాలు జరిగాయని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయన్నారు. వారు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవన్నారు. టెండర్ ప్రక్రియ చాలా పారదర్శకంగా జరుగుతుందన్నారు. కావాలనే కేటీఆర్, హరీశ్ రావులు ప్రభుత్వం పైన బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కొత్త మైన్స్ వస్తేనే సింగరేణికి మనుగడ ఉంటుంది.. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. త్వరలో రామకృష్ణ పూర్ లో కొత్త మైన్ రాబోతుందని ఆ ప్రాంతానికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు మంత్రి వివేక్.
