- ఈఎస్ఐ, పీఎఫ్‌తోపాటు కనీస వేతనాలు కల్పిస్తం
- గృహ కార్మికుల శ్రమకు గుర్తింపు, గౌరవం దక్కాలి
- మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని డొమెస్టిక్ వర్కర్స్ (గృహ కార్మికుల) సామాజిక భద్రత, హక్కుల రక్షణ కోసం త్వరలోనే సమగ్ర చట్టం తీసుకొస్తామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. ఇందుకోసం ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. డొమెస్టిక్ వర్కర్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని, వారు నిరంతరం 14 నుంచి 15 గంటలు శ్రమిస్తూ సమాజ గమనంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. వారి శ్రమకు తగిన గుర్తింపు, గౌరవం దక్కాల్సిన అవసరం ఉందన్నారు. ఇంటర్నేషనల్ డొమెస్టిక్వర్కర్స్ డే సందర్భంగా హైదరాబాద్ అబిడ్స్‌లో నిర్వహించిన గృహ కార్మికుల పోరాట దినోత్సవ సభకు మంత్రి చీఫ్‌గెస్ట్‌గా హాజరై ప్రసంగించారు. డొమెస్టిక్వర్కర్స్ కోరుతున్నట్టుగా వారికి కనీస వేతనాలు, ఈఎస్ఐ, పీఎఫ్ పెన్షన్ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలను చట్టబద్ధంగా కల్పించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. గిగ్ వర్కర్ల కోసం ఏ విధంగానైతే 15 ఏండ్ల పోరాటం తర్వాత ఒక మంచి చట్టాన్ని తీసుకువచ్చామో.. అదే తరహాలో గృహ కార్మికుల రక్షణకు కూడా పటిష్టమైన చట్టం తెస్తామని హామీ ఇచ్చారు. అసంఘటిత రంగంలో ఉన్న విభిన్న విభాగాల కార్మికులందరినీ ఒకే తాటిపైకి తెచ్చి, విదేశాల్లోని చట్టాలను కూడా అధ్యయనం చేసి ఎలాంటి ఇబ్బందులు లేని సమగ్ర చట్టాన్ని రూపొందించాల్సి ఉన్నందున దీనిపై త్వరలోనే కమిటీ వేసి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిన తర్వాత మహిళల సంక్షేమం కోసం అనేక విప్లవాత్మక పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి వివేక్ పేర్కొన్నారు. అలాగే, కార్మికుల పిల్లల భవిష్యత్తు కోసం రాష్ట్రవ్యాప్తంగా 120 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా ఐటీఐ శిక్షణ, జర్మన్, జపనీస్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇప్పించి విదేశాల్లో సైతం ఉద్యోగ అవకాశాలు లభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.
20 ఏండ్లుగా అపరిష్కృతంగానే డిమాండ్లు: ప్రజా సంఘాల నేతలు
గత రెండు దశాబ్దాలుగా గృహ కార్మికులు ఐడెంటిటీ కార్డులు, ఈఎస్ఐ, పీఎఫ్, పెన్షన్ వంటి కనీస హక్కుల కోసం పోరాడుతున్నా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ప్రజా సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. పీఓడబ్ల్యూ నేత సంధ్య, ఎన్ఏపీఎం ప్రతినిధి మీరా సంఘమిత్ర, క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ తదితరులు మాట్లాడారు. మహిళలు తమ ఇండ్లల్లో, బయట మూడు నాలుగు ఇండ్లల్లో 14 గంటల పాటు కఠిన శ్రమ చేస్తున్నా వారిని కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని, పని ప్రదేశాల్లో వేధింపులు, దొంగతనం నెపాలతో అవమానాలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కర్నాటక తరహాలోనే తెలంగాణలోని ప్రజాపాలనలో గృహ కార్మికుల రక్షణ చట్టం డ్రాఫ్ట్ బిల్లును రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని, లేబర్ డిపార్ట్మెంట్, మహిళా శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో దీనిని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. హమాలీ కార్మికులు, గిగ్ వర్కర్లతో పాటు శ్రామిక వర్గమంతా ఐక్యంగా ఉండి హక్కులు సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని సభలో తీర్మానించారు. కార్యక్రమంలో గృహ కార్మికుల సంఘం అధ్యక్షురాలు మంజుల, బ్రదర్ వర్గీస్, ప్రొఫెసర్ కోదండరామ్, వీర గోపాల్, కార్మిక మహిళలపై పుస్తకం రాసిన రచయిత్రి వనమాల తదితరులు పాల్గొన్నారు.
