హైదరాబాద్, వెలుగు: బడ్జెట్ లో ఎస్సీ సబ్ ప్లాన్ కు నిధులు కేటాయించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఎస్సీ సామాజికవర్గ ఎమ్మెల్యేలు, మంత్రులు కోరారు. ఎస్సీ హాస్టల్స్, గురుకులాల్లో చదువుతున్న స్టూడెంట్స్ కు సంబంధించి మెస్, కాస్మెటిక్ బిల్లులు, అద్దె భవనాల రెంట్స్ ను ప్రతినెలా గ్రీన్ చానెల్ ద్వారా రిలీజ్ చేయాలని కోరారు.
ఎస్సీ గురుకులాలు, హాస్టల్స్ లో చదువుతున్న పిల్లలు చాలా పేద కుటుంబాల నుంచి వచ్చిన వారని, వారి విషయంలో మానవతా దృక్పథంతో ఆలోచించి ప్రతినెలా ఫండ్స్ రిలీజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారు. సోమవారం అసెంబ్లీ వాయిదా పడిన తరువాత డిప్యూటీ సీఎం చాంబర్ లో ఈ మీటింగ్ లో జరిగింది. ఈ మీటింగ్ కు మంత్రులు వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ తో పాటు ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మందుల సామెలు, తోట లక్ష్మీకాంతరావు, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలే యాదయ్య, శ్రీగణేశ్, వంశీకృష్ణ పాల్గొన్నారు.
