నల్గొండ జిల్లాలోని రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రులు

నల్గొండ జిల్లాలోని  రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రులు

నల్గొండ, వెలుగు:   నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని రైస్ మిల్లులను మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసి ధాన్యం అన్​లోడింగ్​ ను పరిశీలించారు. ఈ సందర్భంగా రైస్ మిల్ యజమానులు, హమాలీలతో  మాట్లాడారు.  జిల్లాలో ధాన్యం ఎక్కువగా వస్తున్నందున మరింత  పని చేసి సహకరించాలని మంత్రులు హమాలీలను కోరారు. ప్రతిరోజూ తాము 10 నుంచి 15 లారీలు అన్లోడ్ చేస్తున్నామని హమాలీలు తెలిపారు. 

సాధ్యమైనంత ఎక్కువగా ధాన్యం అన్లోడ్ చేసి ప్రభుత్వానికి సహకరించాలని, హమాలీలకు ఎలాంటి సమస్యలు ఉన్నా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. జిల్లాలోని రైస్ మిల్లులు తమ వద్దకు వచ్చే ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేస్తే సమస్యలు తగ్గుతాయని తెలిపారు. అలాగే కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం వేగంగా తరలించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ విషయంపై రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులు ఆలోచించి ధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలని మంత్రులు కోరారు.