- లారీలు, డీసీఎం వెహికల్స్ను సెంటర్లకు మళ్లించండి
- కేంద్రం సహకరించకున్నా అప్పు తెచ్చి ధాన్యం కొంటున్నం
- తడిసిన వడ్లకూ మద్దతు ధర చెల్లిస్తం
- కలెక్టర్లకు మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, శ్రీధర్ బాబు ఆదేశాలు
- హనుమకొండ, యాదాద్రి, పెద్దపల్లిల్లో వడ్ల కొనుగోళ్లపై రివ్యూ
హనుమకొండ/ పెద్దపల్లి/యాదగిరిగుట్ట, వెలుగు: వడ్ల కొనుగోళ్లు పూర్తయ్యేవరకు ఆఫీసర్లు రోడ్ల మీదే ఉండాలని, ఐదారు రోజులు చాలెంజింగ్గా పని చేయాలని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధరబాబు ఆదేశించారు. వడ్ల కొనుగోళ్లపై హనుమకొండ, పెద్దపల్లి కలెక్టరేట్లలో గురువారం అధికారులతో రివ్యూ చేశారు. ‘రైతుకు అండగా.. తెలంగాణ ప్రభుత్వం’ పోస్టర్ ను రిలీజ్ చేశారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.
వంగపల్లికి చెందిన రైతు చిన్నం మల్లయ్యతో మాట్లాడి, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రామాజీపేటలో ధాన్యం నిల్వ గోదాంను పరిశీలించారు. తాజా పరిస్థితులపై అధికారులతో సమీక్షించారు. జూన్ 4, 5 తేదీల్లోగా రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని, ఆలోపు వడ్లు, మక్కల కొనుగోలు, ట్రాన్స్ పోర్ట్ ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. రెండేండ్లలో తెలంగాణలో 10 శాతం వరి దిగుబడి పెరిగిందని, అయినా మద్దతు ధరకు వడ్లు కొంటున్నామన్నారు.
రాష్ట్రంలో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశామని, వడ్లు తడిసినా చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని అన్నారు. ధాన్యం తరలింపు పూర్తయ్యేవరకు ఒక్క లారీ కూడా ఇసుక రవాణాకు వెళ్లకుండా చూడాలని, లారీలు, డీసీఎంలు, ట్రాక్టర్లు ధాన్యం తరలించేందుకే మళ్లించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం సుమారు 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తుండగా, ఎఫ్‌సీఐ కేవలం 51 లక్షల మెట్రిక్ టన్నులే తీసుకుంటుందని, ఎఫ్‌సీఐ కేటాయింపుల కన్నా 25 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ కొనుగోలు చేస్తోందన్నారు.
ఇప్పటివరకు 58 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి, 8.5 లక్షల మంది రైతులకు రూ.10,500 కోట్లు చెల్లించామన్నారు. మరో 18 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేందుకు రెడీగా ఉన్నామన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనుగోలు చేస్తామన్నారు. మిల్లర్లకు ఏవైనా నష్టాలు వచ్చినా ప్రభుత్వం భరిస్తుందని, రైతులకు మాత్రం నష్టం జరగనివ్వమన్నారు. రాష్ట్రంలో 20 కోట్ల గన్నీ బ్యాగులున్నాయని, ఎక్కడా కొరత లేదన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే యాసంగి సీజన్లో 25 నుంచి 30 శాతం ఎక్కువ వడ్లు కొంటున్నామని వివరించారు. ధాన్యం కొనుగోలు అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని, ఆఫీసర్లు తమాషాలు చేయకుండా ప్రక్రియ పూర్తి చేయాలని పొంగులేటి అన్నారు.
తాలు, తరుగు పేరుతో రైతులను వేధిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మిగతా జిల్లాల నుంచి ధాన్యాన్ని కేటాయిస్తే సివిల్ సప్లయిస్ కమిషనర్ కు సమాచారం ఇచ్చి కోఆర్డినేట్ చేసుకోవాలని సూచించారు. అవసరమైతే అదనపు గోదాములు అద్దెకు తీసుకుంటామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నడూ ఒక్క కిలో ధాన్యానికి కూడా తరుగు పేరుతో కోతపెట్టలేదన్నారు. ఎవరైనా తరుగు తీసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని, మిల్లర్లతో రైతులకు పరిహారం ఇప్పిస్తామని హెచ్చరించారు.
ఈసమావేశాల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ కుమార్, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు, కేఆర్ నాగరాజు, చింతకుంట విజయరమణా రావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, గండ్ర వెంకటరమణారెడ్డి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర
తదితరులు పాల్గొన్నారు
- అప్పు తెచ్చి ధాన్యం కొంటున్నం: మంత్రి ఉత్తమ్
కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా అప్పులు తీసుకొచ్చి మరీ వడ్లను కొంటున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఆయన మాట్లాడుతూ, వడ్ల ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ మొదటి ప్లేస్ లో ఉందన్నారు. వడ్ల కొనుగోలుపై ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని, ప్రతిపక్షాల ట్రాప్ లో రైతులు పడొద్దని సూచించారు. ప్రభుత్వ విప్ లు, బీర్ల అయిలయ్య, వేముల వీరేశం, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు.
