తెలంగాణ వచ్చాకే బోనాలు అధికారిక పండగయ్యింది

తెలంగాణ వచ్చాకే బోనాలు అధికారిక పండగయ్యింది
  • మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన తలసాని
  • బోనాల శుభాకాంక్షలు తెలియజేసిన మహమూద్ అలీ, తలసాని

హైదరాబాద్: ‘తెలంగాణాలో పుట్టిన పండగ బోనాలు.. గత యాభై ఏళ్ల నుంచి బోనాలని అధికారిక పండగగా నిర్వచాలని డిమాండ్ చేశాం.. కానీ రాష్ట్రం వచ్చాకే అది సాధ్యమయింది..’ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. బోనాల జాతరను పురస్కరించుకుని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు తలసాని. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రి తలసాని. బోనాల పండుగ సందర్భంగా ప్రజలకు మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ బోనాల శుభాకాంక్షలు తెలియజేశారు.

బోనాల పండుగ ప్రపంచ వ్యాప్తం
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు బోనాలు జరుపుకుంటుండడం గర్వకారణం అన్నారు. ప్రపంచంలో భారీ ఊరేగింపు ఏదైనా ఉంటే అది ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో జరిగే బోనాలేనని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని దేవాలయాల్లో బోనాల నిర్వహణ కోసం సీఎం 15కోట్లు కేటాయించారని తెలిపారు. రేపు రంగం, ఆ తరువాత ఊరేగింపు కార్యక్రమం ఉంటుందన్నారు.

అమ్మవారి గుడి ప్రాంగణంలో రోడ్స్.. లైట్స్ ఏర్పాటు చేశామని, ప్రపంచంలో ఎక్కడ లేని పండగలు మనం ఘనంగా జరుపుకుంటున్నామని మంత్రి తలసాని పేర్కొన్నారు. ప్రభుత్వం అన్ని పండగలను ఘనంగా నిర్వహిస్తోందని, పండగలకు డబ్బులు కేటాయించి.. నిర్వహిస్తున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదన్నారు. అందరికీ అన్ని విధాలుగా ప్రభుత్వం తోడుంటుందన్నారు. అందరం ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా అన్నదమ్ముల్లాగా కలిసి ఉందామని మంత్రి తలసాని కోరారు. 
హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ తలసాని అంటే బోనాలు.. బోనాలు అంటే తలసాని అయ్యిందని.. తలసాని దగ్గరుండి ఏర్పాట్లను చూసుకుంటున్నారని అన్నారు. నిజాం కూడా బోనాలను నిర్వహించారని తెలిపారు. మనది గంగా యమునా తహజీబ్ సంస్కృతి అని పేర్కొన్నారు.  కాగా, హరి బౌలి లోని అక్కన్న మాదన్న మహంకాళి ఆలయాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి,  కాంగ్రెస్ నేత, మాజీ  మంత్రి గీతారెడ్డి దర్శించుకున్నారు. 

బోనాల జాతర సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత: అదనపు కమిషనర్ చౌహాన్

బోనాల జాతర సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని హైదరాబాద్ అదనపు కమిషనర్ చౌహన్ వెల్లడించారు. మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, మఫ్టీలో షీ టీమ్స్ సభ్యులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. వీఐపీల రాకపోకలకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామని.. భక్తులు ప్రశాంతంగా బోనాల జాతరకు రావొచ్చన్నారు. వాతావరణ పరిస్థితి కారణంగా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశామని అదనపు కమిషనర్ చౌహాన్ వివరించారు.