తెలంగాణకు తక్షణమే డీఏపీ, యూరియా సరఫరా చేయాలి : మంత్రులు తుమ్మల, ఉత్తమ్‌‌ 

తెలంగాణకు తక్షణమే డీఏపీ, యూరియా సరఫరా చేయాలి : మంత్రులు తుమ్మల, ఉత్తమ్‌‌ 
  • కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌‌కు మంత్రులు తుమ్మల, ఉత్తమ్‌‌ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, వెలుగు: వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో డీఏపీ, యూరియా ఎరువులు సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌‌‌‌రావు, ఉత్తమ్‌‌ కుమార్‌‌‌‌రెడ్డి కోరారు. అయితే కేంద్రం కేటాయించిన కోటాకు, వాస్తవ సరఫరాకు మధ్య ఎలాంటి వ్యత్యాసం లేకుండా అవసరమైన ఎరువుల సరఫరాను నిరంతరాయంగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు  మంగళవారం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్‌‌ చౌహాన్‌‌కు మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌‌‌‌రావు, ఉత్తమ్ కుమార్‌‌‌‌రెడ్డి  వినతిపత్రం సమర్పించారు. అలాగే, పప్పుధాన్యాలు, నూనె గింజల కొనుగోళ్లపై ప్రస్తుతం అమల్లో ఉన్న 25 శాతం పరిమితితో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని తెలిపారు. రైతులు ఉత్పత్తి చేసిన మొత్తం పంటను కనీస మద్దతు ధర (ఎంఎస్‌‌పీ) కింద కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తద్వారా పప్పుధాన్యాలు, నూనె గింజల సాగుకు మరింత ప్రోత్సాహం లభించడంతోపాటు దేశ ఆహార భద్రత, దిగుమతుల తగ్గింపునకు కూడా దోహదపడుతుందని వివరించారు.

మక్కజొన్న, జొన్నను ఎంఎస్‌‌పీపై సేకరించాలి 

ఈ ఏడాది రాష్ట్రంలో రికార్డుస్థాయిలో సుమారు 15 లక్షల టన్నుల మక్కజొన్న, 3 లక్షల టన్నుల జొన్నల ఉత్పత్తి  జరిగిందని మంత్రులు వివరించారు. అయితే మార్కెట్ ధరలు కనీస మద్దతు ధర కంటే దిగువకు పడిపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భారీ ఆర్థిక భారం భరించి మక్కలు, జొన్నలను కొనుగోలు చేసిందన్నారు. అయితే, ఈ పంటలను కూడా కేంద్ర ప్రభుత్వ కొనుగోలు విధానంలో చేర్చి ఎంఎస్‌‌పీపై సేకరించాలని విజ్ఞప్తి చేశారు.

మరోవైపు ఎరువుల సరఫరా, పోషకాధారిత ఎరువుల సబ్సిడీ (ఎన్‌‌బీసీ) విధానంలో మార్పులకు సంబంధించి ఇటీవల తాను రాసిన లేఖకు కేంద్ర ఎరువుల రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డా స్పందించినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌‌‌‌రావు మీడియాకు వెల్లడించారు. తెలంగాణలో యూరియా, డీఏపీ తదితర ఎరువుల లభ్యత, సరఫరాపై కేంద్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తోందని మంత్రి హామీ ఇచ్చారన్నారు. రాష్ట్ర రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆ శాఖ అధికారులను ఆదేశించినట్టు జేపీ నడ్డా తెలిపారని చెప్పారు.