ధర్మపురి(పెగడపల్లి), వెలుగు: మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, దానికి అనుగుణంగానే మైనార్టీల అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం ధర్మపురి పట్టణ కేంద్రంలోని షాదీఖానాలో కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి ముస్లిం మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మైనార్టీ రుణాల కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లా నుంచి గల్ఫ్ దేశాల్లో చనిపోయినవారిలో ఇప్పటి వరకు 250 మందికి రూ. 5 లక్షలు అందజేసినట్లు చెప్పారు. అనంతరం ధర్మపురి పట్టణంలోని ఈవో ఆఫీస్‌లో 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో రివ్యూ చేశారు.
