Commonwealth Championships: కంబ్యాక్ అదిరింది: కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో మీరాబాయి చానుకు గోల్డ్ మెడల్

Commonwealth Championships: కంబ్యాక్ అదిరింది: కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో మీరాబాయి చానుకు గోల్డ్ మెడల్

భారత క్రీడాకారిణి మీరాబాయి చాను కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్ 2025లో గోల్డ్ మెడల్ గెలుచుకుంది. సోమవారం (ఆగస్టు 25) అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఆమె బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఒలింపిక్స్ లో రజతం గెలుచుకున్న ఆమె కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్ లో గోల్డ్ కొట్టడం విశేషం. గాయం కారణంగా సంవత్సరం పాటు అంతర్జాతీయ పోటీలకు దూరంగా ఉన్న చాను.. 48 కిలోల విభాగంలో మొత్తం 193 కిలోలు (84 కిలోలు + 109 కిలోలు) ఎత్తి అగ్ర స్థానంలో నిలిచింది. 

క్లీన్ అండ్ జెర్క్‌లో మీరాబాయి 105 కిలోలతో ప్రారంభించి 109 కిలోలను విజయవంతంగా అధిగమించింది. ఆమె చివరి లిఫ్ట్ కోసం 113 కిలోలు ప్రయత్నించినా క్లీన్ అటెంప్ట్‌ను నమోదు చేయలేకపోయింది. మలేషియా అథ్లెట్ ఐరీన్ హెన్రీ 161 కిలోలు (73 కిలోలు + 88 కిలోలు)తో రజతం.. వేల్స్‌ క్రీడాకారిణి నికోల్ రాబర్ట్స్ 150 కిలోలు (70 కిలోలు + 80 కిలోలు)తో కాంస్యం గెలుచుకుంది. 

2028 ఒలింపిక్ క్రీడలను దృష్టిలో ఉంచుకుని మీరాబాయి తన బరువు విభాగాన్ని 49 కిలోల నుండి 48 కిలోలకు తగ్గించుకుంది. 48 కిలోల విభాగంలోనే ఆమె 2017లో ప్రపంచ ఛాంపియన్‌షిప్ గోల్డ్ గెలిచింది. అంతేకాదు రెండు కామన్వెల్త్ గేమ్స్ పతకాలను గెలుచుకుంది. 2018 గోల్డ్ కోస్ట్ గేమ్స్‌లో స్వర్ణం ఒకటి కాగా.. 2014 గ్లాస్గో గేమ్స్‌లో ఒక రజత పతకం మరొకటి మీరాబాయి చాను ఖాతాలో ఉన్నాయి.

"అహ్మదాబాద్‌లో బంగారు పతకం గెలుచుకోవడం నాకు నిజంగా ఆనందంగా ఉంది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఒక ఏడాదికే సొంత గడ్డపై ఆడడం చాలా ప్రత్యేక అనుభూతి. ప్రేక్షకుల సపోర్ట్ నాకు చాలా ప్రేరణను ఇచ్చింది. నిరంతరం కృషి చేయడం వలనే మెడల్ సాధించగలిగాను. నా కోచ్‌ల గైడెన్స్, దేశం ఇచ్చిన సపోర్ట్ నాకు ప్రోత్సాహం ఇచ్చింది. అక్టోబర్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లకు నేను సిద్ధమవుతున్న సమయంలో ఈ మెడల్ నాకు గొప్ప ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అంతర్జాతీయ వేదికపై ఇండియా గర్వపడేలా చేయడానికి నా వంతు కృషి చేస్తూనే ఉంటాను".అని మీరాబాయి అన్నారు.