- కొన్ని రోజులు చికిత్స చేసి బతకడని చెప్పిన డాక్టర్లు
- ఇంటికెళ్లాక లేచి నడుస్తూ ఆరోగ్యంగా కనిపించిన పేషెంట్
మిర్యాలగూడ, వెలుగు: అనా రోగ్యంతో హాస్పిటల్కు వెళ్లిన ఓ పేషెంట్ పై డాక్టర్లు డబ్బుల కోసం లేనిపోని రోగాలను అంటగట్టారు. చిన్న సమస్యతో వెళ్లిన అతడికి కొన్ని రోజుల పాటు చికిత్స చేశారు. తీరా అతడికి అన్ని అవయవాలు చెడిపోయాయని, ఇక బతికించలేమని చెప్పారు. ఇంటికి తీసుకెళ్లాక అతడు హెల్దీగా కనిపించడంతో కుటుంబసభ్యులు ఖంగుతి న్నారు. మరో హాస్పిటల్ లో చూపిస్తే అతడికి ఎలాంటి రోగాలు లేవని తేలింది.
గతహాస్పిటల్ వాళ్లు ఎలాంటి టెస్టులు చేయలేదని, డబ్బుకోసమే డ్రామా ఆడారని స్పష్టమైంది. వివరాల్లోకెళ్తే.. త్రిపురారం గ్రామానికి చెందిన లతీఫ్ అనారోగ్యంతో ఈ నెల 7న మిర్యాల గూడలోని రివర్స్ హాస్పిటల్కు తరలించారు. ఆస్పత్రి సిబ్బంది ముందుగా రూ.50 వేల అడ్వాన్స్ తీసుకుని చికిత్స ప్రారంభించారు. పరీక్షించిన డాక్టర్లు లతీఫ్కు అన్ని అవయవాలు దెబ్బతిన్నాయని, కామెర్లు, కిడ్నీ సమస్యలతో పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
వెంటిలేటర్పై ఉంచినా బతికే అవకాశాలు లేవని, వెంటిలే టర్ తీస్తే కొద్ది సెకన్లలోనే చని పోతాడని కుటుంబ సభ్యులకు చెప్పారు. చివరి చూపు కోసం బంధువులను పిలుచుకోవా లని కూడా సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు లతీఫ్ను వెంటిలేటర్ తో ఇంటికి తీసుకెళ్లారు. బంధువులు చేరుకున్న తర్వాత వెంటిలేటర్ తీసిన కొద్దిసేపటికే లతీఫ్ లేచి కూర్చొని "ఆకలిగా ఉంది, అన్నం పెట్టండి" అని చెప్పడంతో అందరూ ఆశ్చర్య పోయారు. అనంతరం సాధారణంగా నడుచుకుం టూ తిరగడం చూసి బంధువులు అవాక్కయ్యారు
మరో ఆస్పత్రిలో బయటపడ్డ నిజం..
తర్వాత కుటుంబ సభ్యులు లతీఫ్ను నార్కెట్పల్లి కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు పరీక్షలు నిర్వహించి అతనికి పెద్దగా సమస్యలేమీ లేవని, కేవలం ఇన్ఫెక్షన్ వల్ల అస్వస్థత కలిగిందని తెలిపారు. చిన్న శస్త్రచికిత్స చేస్తే సరిపోతుందని చెప్పారు. ఇదిలా ఉండగా రివర్స్ ఆస్పత్రిలో టెస్టులు చేయకుండానే బిల్లుల్లో చూపించి డబ్బులు వసూలు చేశారని లతీఫ్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఎండోస్కోపీ, లివర్ టెస్ట్, 2డి ఈకోసహా 45 టెస్టులు చేసినట్లు బిల్లులు ఇచ్చినా వాటి రిపోర్టులు ఇవ్వలేదని తెలిపారు. ఒక ఎక్స్రేమాత్రమే ఇచ్చారని చెప్పారు..
