- రూ.57 లక్షల ఆస్తి నష్టం
మిర్యాలగూడ, వెలుగు: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామంలోని 33 కేవీ సబ్ స్టేషన్‌లో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. ఎండల తీవ్రతకు తోడు ఓవర్ హీట్ కారణంగా ట్రాన్స్‌ఫార్మర్‌లోని ఇన్సులేటర్లు ఒక్కసారిగా పేలిపోవడంతో భారీ మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. సబ్ స్టేషన్‌లో ఫైర్ సెక్యూరిటీకి అవసరమైన గ్యాస్ కిట్లు లేకపోవడం వల్ల ప్రమాద తీవ్రతను త్వరగా తగ్గించలేకపోయారని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో సుమారు రూ.57 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
దుకాణాలు.. అగ్గిపాలు
కామారెడ్డి టౌన్, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇందిరా చౌక్ పాత బస్టాండు సమీపంలో రోడ్డు పక్కన ఉన్న పలు షాపులు మంటల్లో కాలిపోయాయి. బాధితులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. మెయిన్ రోడ్డుకు ఆనుకుని ఇనుప రేకుల షెడ్లు, తడకలతో చిరు వ్యాపారులు పండ్లు, పూల షాపులు, చిన్న హోటళ్లను నిర్వహిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి ఆకస్మికంగామంటలుచెలరేగి వరుసగా ఉన్నషాపులను ఆవరించాయి.
మంటలు ఎగసిపడుతుండటాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే షాపుల్లో ఉన్న సామాగ్రి పూర్తిగా కాలిబూడిదైంది. చెత్తకు మంటలు అంటుకుని పక్కనున్న ట్రాన్స్‌ఫార్మర్ ద్వారా ప్రమాదం జరిగిందా, లేక షాపుల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించిందా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. సుమారు రూ.30 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.
