తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మన సంస్కృతి, భాష, అస్తిత్వాన్ని చాటుకునేలా పాఠ్యపుస్తకాలను రూపొందించుకోవడం గర్వకారణం. అయితే, ఈ ప్రక్రియలో విద్యార్థుల వయస్సు, గ్రహణ శక్తిని పరిగణనలోకి తీసుకోకుండా సిలబస్‌ను భారీగా పెంచడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యంగా 8 నుంచి 10వ తరగతుల విద్యార్థులు తెలుగు పాఠాల భారాన్ని మోయలేక చదువులో వెనకబడిపోతున్నారు. ఎనిమిదో తరగతిలోని 'సముద్ర ప్రయాణం' పాఠంలో రచయిత తగినంత ధనం లేకుండానే పడవ ప్రయాణం చేయడం పిల్లలకు తప్పుడు సంకేతాలు ఇచ్చే ప్రమాదం ఉంది.
అలాగే 'అసామాన్యులు', 'సింగరేణి' వంటి పాఠాలు సమాచార భారంతో నిండి ఉన్నాయి. ఇక 'మాట్లాడే నాగలి' పాఠంలో ఒక వర్గం ఆహారపు అలవాట్లను ప్రస్తావించడం, 'చిందు ఎల్లమ్మ' పాఠంలో కుల వివక్ష అంశాలు పిల్లల మధ్య అనవసర చర్చలకు, ఎగతాళికి దారితీస్తున్నాయి. ఇది వారి పసి మనసులపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. 9వ తరగతిలో 'కోరస్', 'వాగ్భూషణం' వంటి పాఠాలు పూర్తిగా కళాశాల స్థాయి (డిగ్రీ) ప్రమాణాలతో ఉన్నాయి.
కఠినమైన పదజాలం వల్ల విద్యార్థులు పాఠాన్ని అర్థం చేసుకోలేక రచయితల పట్ల అసహనాన్ని పెంచుకుంటున్నారు. 'ఉద్యమ స్ఫూర్తి' వంటి పాఠాల్లో నేటి పాలకుల పట్ల ప్రతికూల ఆలోచనలు కలిగించే అంశాలు ఉండటం గమనార్హం. పదో తరగతిలో 'కొత్త బాట' వంటి పాఠాలు మహబూబ్ నగర్ మాండలికంలో ఉండటం వల్ల ఇతర జిల్లాల విద్యార్థులు చదవడానికి, రాయడానికి తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.
'భూమిక' వంటి పాఠాల్లో చారిత్రక అంశాలు ఒక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా ఉండటం వల్ల సామాజిక సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించి, వారిలో భాషాభిమానాన్ని పెంచేలా సిలబస్‌ను హేతుబద్ధీకరించాలి. క్లిష్టమైన పదజాలం, వివాదాస్పద అంశాలను తొలగించి, విద్యార్థుల వయస్సుకు తగినట్లుగా పాఠాలను రూపొందించాలి.
కాళేశ్వరం కృష్ణమూర్తి, తెలుగు భాషా విషయ నిపుణుడు, హన్మకొండ
* ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ఐడీ openpage@v6velugu.com
* రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
* రచన 700 పదాలకు మించరాదు.

