
- తుది దశకు చేరుకున్న ఏర్పాట్లు
- నేడు సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్
- రేపు ఈవెంట్ ఆర్గనైజర్ల మీడియా సమావేశం
- గ్రాండ్ ఫినాలేకు మూడు వేల పాసులు
హైదరాబాద్, వెలుగు: మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల అందాల తారలు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. ఆదివారం మిస్ వరల్డ్ బ్రెజిల్ జెస్సికా స్కాండుజ్ పెద్రోసో, మిస్ సౌత్ ఆఫ్రికా జోయలైజ్ జాన్సెన్ వాన్ రెన్స్‌బర్గ్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకురాగా, తెలంగాణ ప్రభుత్వం తరఫున అధికారుల బృందం గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పింది. ఇప్పటికే మిస్ వరల్డ్ సంస్థ సీఈవో, చైర్ పర్సన్ మిస్ జూలియా ఎవెలిన్ మోర్లీ, మిస్ వరల్డ్ ప్రతినిధి మిస్ కెర్రి, మిస్ కెనడా మిస్ ఎమ్మా డీనా కాథరిన్ మోరిసన్ హైదరాబాద్‌కు చేరుకున్నారు.
ఈ నెల 7 నుంచి 31 వ తేదీ వరకు మిస్ వరల్డ్ పోటీలు జరగనుండటంతో సోమ, మంగళవారాల్లో 120 దేశాల నుంచి కంటెస్టెంట్లు, ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు సైతం హైదరాబాద్‌కు రానున్నారు. పోటీలకు ఏర్పాట్లు తుది దశకు చేరుకోగా అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌలత్‌లు కల్పిస్తోంది. తొలిసారిగా హైదరాబాద్‌లో పోటీలు జరుగుతుండటంతో సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆయన ఇప్పటికే అధికారులతో సమీక్షించి ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. మళ్లీ సోమవారం కూడా మిస్ వరల్డ్ పోటీలపై అధికారులతో సీఎం రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు.
అందాల పోటీల ఏర్పాట్లు, వివిధ దేశాల నుంచి వచ్చిన వారికి బస, భద్రతా ఏర్పాట్లపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది. మంగళవారం మిస్ వరల్డ్ ఈవెంట్ ఆర్గనైజర్లు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పోటీలకు సంబంధించి పూర్తి క్లారిటీ వస్తుందని టూరిజం అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని 22 ప్రాంతాలను అందగత్తెలు విజిట్ చేయనున్నందున ఆ ప్రాంతాల్లోనూ ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ నెల 31న మిస్‌వరల్డ్ గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ కార్యక్రమానికి 3 వేల మంది సందర్శకులకు మాత్రమే ఎంట్రీ పాస్‌లు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ప్రజలు ఈ పోటీలను వీక్షించేలా హైదరాబాద్‌తోపాటు జిల్లా కేంద్రాలు, ముఖ్య కూడళ్లలో రాష్ట్ర ప్రభుత్వం స్ర్కీన్లను ఏర్పాటు చేయాలన్న యోచనలో ఉన్నట్లు తెలిసింది. కాగా, ఈ వేడుక ద్వారా తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు పర్యాటక ప్రాంతాల సందర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, వైద్య సదుపాయాల ప్రదర్శన వంటి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. ‘తెలంగాణ.. జరూర్ ఆనా, తెలంగాణ.. హార్ట్ ఆఫ్ ది డెక్కన్’ వంటి నినాదాలతో 72వ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తోంది.
150కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం
మిస్ వరల్డ్ పోటీలతో ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పర్యాటక ప్రదేశాలకు విశేష ప్రచారం దక్కనుంది. తెలంగాణ సాంస్కృతిక వైభవం, చారిత్రక గాథలు, ఆధునిక అభివృద్ధి, పర్యాటక ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలపడంతోపాటు రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో ‘మల్టీడైమెన్షనల్ టూరిజం హబ్’గా నిలిపే అవకాశం లభిస్తుంది. 120 దేశాల నుంచి ప్రతినిధులు ఈ పోటీలకు రానుండగా, 150పైగా దేశాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లద్వారా కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ పోటీలకు150 దేశాలకు చెందిన మీడియా ప్రతినిధులు హైదరాబాద్‌కు వస్తున్నారు. పోటీదారుల టూర్ తమ మీడియా ద్వారా అంతర్జాతీయ ప్రచారం కల్పించి తెలంగాణ బ్రాండ్‌ను ప్రపంచానికి చాటి చెప్పాలని ప్రభుత్వం యోచిస్తోంది.
రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన నాగార్జున సాగర్ బుద్ధవనం, చార్మినార్, చౌమొహల్లా ప్యాలెస్, వరంగల్‌లోని వెయ్యి స్తంబాల గుడి, రామప్ప ఆలయం, యాదగిరి గుట్ట టెంపుల్, పోచంపల్లి, పిల్లలమర్రి, శిల్పారామం, పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్, సచివాలయం, ఎక్స్పీరియం ఎకో పార్కు, ఉప్పల్‌లో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌కు కూడా పోటీదారులు హాజరయ్యేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఈ నేపథ్యంలో ఆయా నగరాల్లో పోలీస్ కమిషనర్లు, టూరిజం అధికారులు, జిల్లాల్లో కలెక్టర్లు, సీపీ, ఎస్పీలతోపాటు ఇతర శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
అందగత్తెలు, ప్రముఖులు సందర్శించనున్న 22 ప్రాంతాల్లో కోఆర్డినేషన్ చేయడానికి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కో అధికారిని నియమించారు. ఇప్పటికే హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్య వెయ్యి స్తంభాల గుడిలో ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. మహుబూబ్‌నగర్ జిల్లా పిల్లలమర్రిలో కలెక్టర్, ఎస్పీ ఇతర అధికారులు పర్యటించి ఏర్పాట్లపై ఆరా తీశారు. హైదరాబాద్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుశాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. మదీనా, పత్తర్‌గట్టి, గుల్జర్ హౌస్, చార్మినార్, లాడ్ బజార్ గాజుల మార్కెట్ నుంచి చౌమొహల్లా ప్యాలెస్‌దాకా మిస్ వరల్డ్ పోటీదారులు ఈ నెల 13న హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నారు.
తెలంగాణ వారసత్వం, సంస్కృతిని తెలిపేలా..
తెలంగాణ వారసత్వం, చరిత్ర, సంస్కృతిని తెలిపేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గెస్ట్‌ల కోసం చౌమొహల్లా ప్యాలెస్‌లో వెల్‌కం డిన్నర్ ప్లాన్ చేశారు. ఇందులో 38 రకాల తెలంగాణ సంప్రదాయ వంటకాలను సిద్ధం చేయనున్నారు. కాంటినెంటల్ వెరైటీలకు కూడా హైదరాబాద్ వేదిక అనేలా వివిధ ప్రాంతాల ఫేమస్ ఫుడ్స్‌ను పరిచయం చేయనున్నారు. హైదరాబాద్‌లో అభివృద్ధిని అతిథులకు చూపించనున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు ద్వారా వివిధ దేశాలతో హైదరాబాద్‌కు ఉన్న కనెక్టివిటీని వివరించనున్నారు.
హైదరాబాద్‌లో అందించే వైద్య సేవల గురించి పోటీదారులు, విదేశీ మీడియాకు వివరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఏఐజీ హాస్పిటల్‌లో నిర్వహించే మెడికల్ టూరిజం ఈవెంట్‌ను అధికారులు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. దీనిని సీఎం మానిటరింగ్ చేస్తున్నారు. ఆస్పత్రిలో అందిస్తున్న ఆధునిక వైద్య సేవలు, సదుపాయాలు తెసుకునేలా అక్కడికి తీసుకువెళ్లి వివరించనున్నారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల కంటే అతి తక్కువ ఖర్చులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించనున్నారు.