పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో అందాల భామల సందడి: తుపాకులు పట్టుకుని ఫోజులు

పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో అందాల భామల సందడి: తుపాకులు పట్టుకుని ఫోజులు

హైదరాబాద్: మిస్ వరల్డ్ 2025 పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన సుందరీమణులు తెలంగాణను చుట్టేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలోని ప్రముఖ పర్యాటక స్థలాలు చార్మినార్, చౌహమహల్లా ప్యాలెస్, రామప్ప, వేయిస్థంభాల గుడి, యాదగిరి గుట్ట, పిల్లలమర్రి, ఎక్స్ పీరియం ఎకో పార్క్ వంటి స్థలాలను సందర్శించిన అందాల భామలు ఆదివారం (మే 18) హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‎ను సందర్శించారు.  

రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, మహిళలు పిల్లలపై వేధింపుల నివారణ, డ్రగ్స్ కట్టడికి చేపట్టిన చర్యలు, నేరాల నియంత్రణ, నేర నివారణలో ఉపయోగిస్తున్న ఆధునిక శాస్త్ర సాంకేతిక పద్ధతులు తదితర అంశాలపై తెలంగాణా పోలీస్ శాఖ చేపట్టిన పటిష్టమైన చర్యలపట్ల మిస్ వరల్డ్ కాంటెస్టర్లు సంతృప్తిని వ్యక్తం చేశారు

 డ్రగ్స్ నివారణకై తెలంగాణా పోలీస్ చేపట్టిన చర్యలకు తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ పోస్టర్లపై సంతకాలు చేసి పలు మెసేజ్‎లను కూడా రాశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల రక్షణకు ప్రభుత్వం అమలు చేస్తున్న పలు విధానాలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. 

ALSO READ | Miss World 2025: సెక్రటేరియట్లో అందగత్తెలు

ముందుగా బంజారాహిల్స్‎లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‎కు చేరుకున్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్‎లకు పోలీస్ అశ్విక దళం, పైపు బ్యాండ్, మోటర్ సైకిల్ రైడర్స్, స్నిప్పర్ డాగ్ స్క్వాడ్‎లతో పోలీస్ శాఖ ఘన స్వాగతం పలికింది. అనంతరం పోలీస్ కమాండ్ కంట్రోల్ ఆడిటోరియంలో పోలీస్ శాఖ అమలు చేస్తోన్న పలు విధానాలు, అవి పనిచేసే విధానంపై అందాల భామలకు ప్రజంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ పటిష్టమైన విధానాలవల్ల రాష్ట్రంలో 17  శాతం నేరాలు తగ్గాయని, వివిధ అంశాలలో తెలంగాణా పోలీస్ కు అంతర్జాతీయ అవార్డులు కూడా లభించాయని వారికి చెప్పారు.

దేశంలో మరెక్కడా లేని విధంగా ట్రాన్స్ జెండర్ల సేవలను ట్రాఫిక్ విభాగంలో ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. మొత్తం ప్రపంచానికే సవాలుగా మారిన సైబర్ నేరాల నియంత్రణలో అత్యంత ఆధునిక టెక్నాలజీని వాడుతున్నామని, లక్షల సంఖ్యలో ఏర్పాటు చేసిన సీసీ టీవీల వల్ల, రాష్ట్రంలో ఎక్కడ నేరం జరిగినా వెంటనే తగు చర్యలను చేపడుతున్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా సేఫ్టీ టూరిజంలో తెలంగాణా అత్యంత సురక్షితమైనది, ఇందుకు తెలంగాణా పోలీస్ చేపట్టిన పటిష్టమైన చర్యలే కారణమని వివరించారు. ఈ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన పోలీసు ఆయుధాల ప్రదర్శన, అక్టోపస్, గ్రే హౌండ్స్, పోలీస్ జాగిలాల ప్రదర్శనలు, పైప్ బ్యాండ్, అశ్విక దళంలను కాంటెస్టర్లు ఆసక్తిగా పరిశీలించారు. 

సెల్ఫీలను దిగారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను నిరంతరం పరిశీలించే అత్యాధునిక కమాండ్ కంట్రోల్ గదిలో ఏర్పాటు చేసిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, సర్వేలెన్స్ ఫీడ్‎లు, తక్షణమే స్పందించే వ్యవస్థను మిస్ వరల్డ్ కాంటెస్టర్లు స్వయంగా పరిశీలించారు. జీవ ప్రమాణాలు పెంపొందించడం, సురక్షిత టూరిజంకు, రాష్ట్ర అభివృద్ధికి  భద్రతా చర్యలు ఎంతటి కీలక  పాత్ర వహిస్తాయో తెలంగాణా పోలీస్‎ను ఉదాహరణ చెప్పవచ్చని మిస్ వరల్డ్ కాంటెస్టర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం, మరే రాష్ట్రంలో లేని విధంగా, ట్రాఫిక్ నియంత్రణా చర్యలకు సేవలందిస్తున్న ట్రాన్స్ జెండర్లతో కలసి మిస్ వరల్డ్ కాంటెస్టర్లు ఫోటో దిగారు.