వాషింగ్టన్: అమెరికా సీజ్ చేసిన ఇరాన్ షిప్‌లో మిస్సైల్స్ తయారీకి ఉపయోగించే రసాయనాలు ఉన్నాయని రిపబ్లికన్ పార్టీ నాయకురాలు నిక్కీ హేలీ సంచలన ఆరోపణలు చేశారు. చైనా నుంచి వస్తున్న ఈ షిప్‌లో రసాయనాల రవాణా జరుగుతుందని తెలిపారు. ఈ మేరకు నిక్కీ హేలీ ‘ఎక్స్’లో ఓ పోస్ట్ పెట్టారు. “ఈ వారాంతంలో అమెరికా సీజ్ చేసిన నౌక చైనా నుంచి ఇరాన్ వైపు వెళ్తున్నది. ఇందులో మిస్సైల్స్‌కు ఉపయోగించే రసాయనాల రవాణా జరుగుతోంది’’ అని తెలిపారు.
ఇరాన్ ప్రభుత్వానికి చైనా బహిరంగంగా మద్దతు పలుకుతుందనడానికి ఇదొక నిదర్శనమని, ఈ వాస్తవాన్ని ఇక ఏమాత్రం విస్మరించలేమని ఆమె హెచ్చరించారు. అమెరికా దళాలు స్వాధీనం చేసుకున్న ఇరాన్ నౌకను‘తౌస్కా’గా గుర్తించారు. ఇది ఇరాన్ షిప్పింగ్ లైన్స్ గ్రూపుకు చెందిన చిన్న కంటైనర్ నౌక. చాబహార్ పోర్టుకు సమీపంలో అమెరికా దళాలు ఆదివారం దీన్ని అదుపులోకి తీసుకున్నాయి.

