కనిపించకుండా పోయిన అన్న.. పాతికేళ్లకు తిరిగొచ్చిండు

కనిపించకుండా పోయిన అన్న.. పాతికేళ్లకు తిరిగొచ్చిండు

ఒకే తల్లి రక్తం పంచుకుని పుట్టిన నలుగురు తోబుట్టువులను విధి చిన్నతనంలోనే వేరు చేసింది. తల్లిదండ్రులు మరణించడంతో పిల్లలు బంధువులతో తలోదిక్కు వెళ్లిపోయారు. పాతికేళ్లక్రితం విడిపోయిన నలుగురిలో ముగ్గురు మాత్రమే ఎప్పుడూ కలుసుకుంటూ ఉన్నారు. నలుగురిలో పెద్దవాడైన ఆ ఒక్కడి జాడ మాత్రం తెలియలేదు. అయితే, ఇన్నేళ్లకు ఆ ‘పెద్దన్న’ జాడ దొరికింది. విడిపోయిన నలుగురిని ‘ఫేస్‌‌బుక్‌‌’ ఒక్కటి చేసింది. పాతికేళ్లుగా దూరమైన అన్నను తెచ్చిచ్చింది.

మంచిర్యాల జిల్లా హాజీపూర్​ మండలం నంనూర్​ గ్రామానికి చెందిన ఆడెపు శంకరయ్య, శంకరమ్మ దంపతులకు ముగ్గురు కొడుకులు.. గురువయ్య, లక్ష్మణ్​, సతీష్, కూతురు రమ్య ఉన్నారు. 27 ఏండ్ల కిందట శంకరయ్య చనిపోగా, ఆ తర్వాత రెండేళ్లకు శంకరమ్మ కన్ను మూసింది. అప్పటికి పెద్ద కొడుకు గురువయ్యకు పదిహేనేళ్లు కాగా, మిగతా ముగ్గురు చిన్నపిల్లలు. వారి పోషణ బాధ్యతలను బంధువులు తలా ఒకరు తీసుకుని, వాళ్ల ఊళ్లకు వెళ్లిపోయారు. రెండేళ్ల చిన్నారి రమ్యను శంకరయ్య సోదరుడు తీసుకెళ్లాడు. గురువయ్య లక్షెట్టిపేటలోని బంధువుల దగ్గర ఉండగా, లక్ష్మణ్​ నంనూర్​లోనే  పెరిగాడు. అన్నదమ్ముల్లో చిన్నవాడైన సతీష్‌‌ను జన్నారంలోని బంధువులు పెంచి పెద్ద చేశారు. అయితే, బంధువుల ఇంట్లో బాధలు పడలేక గురువయ్య కొన్నాళ్లకు చెప్పాపెట్టకుండా ఇంట్లోంచి వెళ్లిపోయాడు. వరంగల్, హన్మకొండలో హోటళ్లలో పనిచేస్తూ మంచి కుక్‌‌గా పేరు తెచ్చుకున్నాడు. తర్వాత సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​కు వచ్చి స్థిరపడ్డాడు. తాను అనాథనని చెప్పి, అక్కడే పెళ్లి చేసుకుని భార్య, ఇద్దరు పిల్లలతో బతుకుతున్నాడు. చిన్నవాడైన సతీష్​ బాగా చదువుకుని హైదరాబాద్‌‌లో సాఫ్ట్‌‌వేర్​ జాబ్​ చేస్తున్నాడు. ఫేస్‌‌బుక్‌‌లో ఒక రోజు తమ ఇంటిపేరుతో ఎవరైనా ఉన్నారా? అని సెర్చ్​ చేస్తుంటే గురువయ్య కనిపించాడు. ఆయన ప్రొఫైల్‌‌లో తమ చిన్నప్పటి ఫొటో కనిపించింది. తన దగ్గర ఉన్న ఫొటోతో పోల్చుకుంటే రెండూ ఒకేలా​ ఉన్నాయి. 

వెంటనే ఫేస్‌‌బుక్​ ఫ్రెండ్స్​ద్వారా గురువయ్య ఫోన్​నెంబర్​ తీసుకొని మాట్లాడాడు. వివరాలు తెలుసుకుని, ఇన్నేళ్లుగా వెతుకుతున్న పెద్దన్నయ్య తనే అని గుర్తుపట్టాడు. పట్టరాని ఆనందంతో రెండో అన్నకు, చెల్లెకు ఈ విషయం చెప్పాడు. అందరూ కలిసి గత శుక్రవారం హుస్నాబాద్‌‌ వెల్లి గురువయ్యను కలుసుకున్నారు. గురువయ్య కుటుంబంతో కలిసి తిరిగి సొంతూరైన నంనూర్‌‌‌‌ వచ్చాడు. గురువయ్యను చూసిన బంధుమిత్రులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. గురువయ్య వెళ్లేనాటికి ఉన్న నంనూర్​ గ్రామం పదిహేనేళ్ల కిందట ఎల్లంపల్లి ప్రాజెక్టులో మునిగిపోయింది. గ్రామస్తులంతా పునరావాస కాలనీలకు తరలి పోయారు. దీంతో గురువయ్య తమ బంధువులను, తోబుట్టువులను కలుసుకునే ప్రయత్నం చేయలేదు. అంతేగాకుండా, మళ్లీ తాను తిరిగి వచ్చి బంధువులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక పాతికేళ్లలో ఎన్నడూ రాలేదని చెప్పాడు. గురువయ్య అనాథ అని భావిస్తున్న ఆయన భార్యాపిల్లలకు, ఇంత పెద్ద ఫ్యామిలీ ఉందని తెలి యడంతో వారి ఆనందానికి కూడా అవధులు లేవు.
- చౌదరి సురేష్​, మంచిర్యాల, వెలుగు