మేం గెలిస్తే పది కిలోల బియ్యం ఇస్తం.. పదేండ్లలో మోదీ చేసిందేమీ లేదు: ఖర్గే

మేం గెలిస్తే పది కిలోల బియ్యం ఇస్తం.. పదేండ్లలో మోదీ చేసిందేమీ లేదు: ఖర్గే
  •     ఇండియా కూటమి బలపడింది
  •     బీజేపీ నుంచి రాజ్యాంగాన్ని రక్షిస్తామని కామెంట్​

లక్నో (యూపీ): ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రతి నెలా ఒక్కొక్కరికి పది కిలోల రేషన్ బియ్యం ఫ్రీగా ఇస్తామని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ఇప్పుడు మోదీ కేవలం 5 కిలోలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. తాము పవర్​లోకి వస్తే ప్రధాని ఇచ్చేదానికంటే డబుల్ ఇస్తామని చెప్పారు. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వం చేసిందేమీలేదని, నెలకు కేవలం 5 కిలోల బియ్యం ఇస్తూ చేతులు దులుపుకుంటున్నదని విమర్శించారు. 

లోక్​సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా లక్నోలో సమాజ్​వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్​తో కలిసి ఖర్గే మీడియాతో మాట్లాడారు. ‘‘మేము అధికారంలోకి వస్తే కచ్చితంగా పది కిలోల బియ్యం ఇస్తాం. ఇప్పటికే తెలంగాణ, కర్నాటకలో ఈ గ్యారంటీ అమలు చేస్తున్నాం. నాలుగు ఫేజ్​ల ఎన్నికల తర్వాత ఇండియా కూటమి బలమైన ప్రతిపక్షంగా మారింది. మోదీకి గుడ్ బై చెప్పేందుకు దేశ ప్రజలంతా సిద్ధమవుతున్నారు. బీజేపీ నుంచి రాజ్యాంగాన్ని రక్షించేందుకు మేం పోరాడుతున్నం. ఆ పార్టీ నేతలు రాజ్యాంగాన్ని మారుస్తామంటూ బహిరంగ కామెంట్లు చేస్తున్నా మోదీ సైలెంట్ గా ఉండటం ఆశ్చర్యం వేస్తున్నది. 

జూన్ 4న ఇండియా కూటమి అధికారంలోకి వస్తది. రాజ్యాంగాన్ని మారుస్తామని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కర్నాటకలో అన్నారు. దీనికోసం మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరమని చెప్పారు. యూపీలో కూడా చాలా మంది బీజేపీ లీడర్లు రాజ్యాంగాన్ని మారుస్తామని అంటున్నరు’’ అని ఖర్గే అన్నారు. మోదీ ఎక్కడ మాట్లాడినా.. హిందు, ముస్లిం, చికెన్, మటన్, బీఫ్, ఫిష్, మంగళసూత్రం గురించే మాట్లాడుతున్నారన్నారు. ఇవి కాకుండా మాట్లాడేందుకు చాలా అంశాలున్నాయన్నారు. ‘‘పదేండ్లలో మీరేం చేశారో ప్రజలకు చెప్పండి. హిందూ, ముస్లిం కార్డుతో ఆడుకోవడం ఆపండి. కాగా, యూపీలోని 80 స్థానాల్లో 79 సీట్లు ఇండియా కూటమికి వస్తాయని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ ధీమా వ్యక్తం చేశారు.