ఉద్యోగులకు 30% ఫిట్‌‌‌‌మెంట్‌‌ ఇవ్వాలి

ఉద్యోగులకు 30% ఫిట్‌‌‌‌మెంట్‌‌ ఇవ్వాలి
  • పీఆర్సీ కమిషన్‌‌కు బీసీటీఏ వినతి 

హైదరాబాద్,వెలుగు: రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులకు 30 శాతం ఫిట్‌‌మెంట్‌‌తో వేతన సవరణ చేయాలని బహుజన్ క్లాస్ టీచర్స్ అసోసియేషన్ (బీసీటీఏ) రాష్ట్ర అధ్యక్షుడు కె.కృష్ణుడు విజ్ఞప్తి చేశారు. బుధవారం పీఆర్సీ కమిషన్ చైర్మన్ శివశంకర్‌‌‌‌ను బీసీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.లక్ష్మణ్ గౌడ్, ఇతర నేతలతో కలిసి ఆయన వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కృష్ణుడు మాట్లాడుతూ.. కనీస వేతనం రూ.35 వేలు, ఇంక్రిమెంట్ రేట్ 3 శాతం ఇవ్వాలని కోరారు. బీసీ టీచర్లకు ఉన్నత చదువుల కోసం వేతనంతో కూడిన ప్రత్యేక సెలవులు మంజూరు చేయాలన్నారు. 

బీసీ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేలా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు, జీహెచ్ఎంసీ పరిధిలోని ఉద్యోగులకు 30 శాతం, జిల్లా కేంద్రాల్లో 25 శాతం, మున్సిపాలిటీల్లో 20 శాతం, మారుమూల ప్రాంతాల్లోని వారికి 18 శాతం హెచ్‌‌ఆర్ఏ ఇవ్వాలని పీఆర్టీయూటీ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి భిక్షంగౌడ్ కోరారు. మాజీ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డితో కలిసి ఆయన పీఆర్సీ కమిషన్‌‌ను కలిశారు. పీఆర్సీ ఫిట్‌‌మెంట్ 45 శాతం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.