Usman Tariq: టీ20 ప్రపంచ కప్–2026లో భాగంగా ఫిబ్రవరి 15వ తేదీన భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. కొలొంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ కి సంబంధించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మ్యాచ్ ముగిసిన అనంతరం మైదానం వెలుపల భద్రత విషయంలో వివక్ష చూపించారంటూ పాక్ బౌలర్ ఉస్మాన్ తారిక్ సంచలన ఆరోపణలు చేశాడు. శ్రీలంక పోలీసులు టీమిండియా ఆటగాళ్ల పట్ల సానుకూలంగా ఉండటంతో పాటు తమతో దురుసుగా వ్యవహరించారని అతడు తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.
ఉస్మాన్ తారిక్ మాట్లాడుతూ... 'మేము భారత్ చేతిలో ఓడిపోయినందుకు పెద్దగా బాధపడటం లేదు.. గెలుపు, ఓటములు ఆటలో భాగమే.. కానీ మా ప్లేయర్స్ తో పాటు టీం సిబ్బందిలోని అందరి బ్యాగులను శ్రీలంక పోలీసులు రెండు మూడుసార్లు క్షుణ్ణంగా చెక్ చేశారు. అదే సమయంలో టీమిండియా ఆటగాళ్ల బ్యాగులను మాత్రం కనీసం తనిఖి చేయకుండానే పంపించారు అని తనలోని అక్కసును వెల్లగక్కాడు. మాపై ఈ విధమైన పక్షపాతం ఎందుకు చూపుతున్నారు? అని క్వశ్చన్ చేశాడు. ఇంటర్ నేషనల్ టోర్నీల్లో ప్లేయర్స్ అందరికీ సమానమైన భద్రతా నిబంధనలు ఉండాలి.. కానీ శ్రీలంకలో మాత్రం పాక్ ఆటగాళ్లను ఇబ్బంది పెడుతున్నారని ఉస్మాన్ తారిక్ ఆరోపణలు గుప్పించారు.
హోటల్ నుంచి మైదానానికి వచ్చే సమయంలోనూ, తిరిగి వెళ్లే టైంలోనూ చెకింగ్ పేరుతో పాకిస్థాన్ ఆటగాళ్లను ఎక్కువ సేపు వేచి ఉండేలా చేస్తున్నారని ఉస్మాన్ తారిక్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. పాక్ ప్లేయర్లు ఏమైనా ఉగ్రవాదులు లాగా కనిపిస్తున్నారా? అంటూ ప్రశ్నించాడు. భారత ఆటగాళ్లకు ఓ రూల్, పాక్ ప్లేయర్లకు ఇంకో రూలా? అంటూ లంక పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కొందరు క్రికెట్ ఫ్యాన్స్ భద్రత విషయంలో రాజీ పడకూడదని చెబుతుండగా, మరికొందరు ఒకే టోర్నీలో రెండు జట్ల మధ్య ఇలాంటి వ్యత్యాసం ఉండటం మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉస్మాన్ తారిక్ కామెంట్స్ పై ఐసీసీ లేదా శ్రీలంక క్రికెట్ బోర్డు మాత్రం ఇంకా రియాక్ట్ కాలేదు.
