లండన్: తన క్రికెట్ భవిష్యత్‌పై వస్తున్న ఊహాగానాలను టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ కొట్టి పారేశాడు. తాను ఆడుతున్నంత కాలం ఇలాంటి ప్రచారం కొనసాగుతూనే ఉంటుందన్నాడు. దీని గురించి ఆలోచించడం కంటే పరుగులు చేయడంపైనే ఎక్కువగా దృష్టి పెడతానని స్పష్టం చేశాడు.
‘నా కెరీర్ ప్రారంభం నుంచి విమర్శల గోల వింటూనే ఉన్నా. నేను జట్టులో ఉన్నంతకాలం ఇది కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి దీని గురించి పెద్దగా పట్టించుకోను. మైదానంలో నేను ఏం చేస్తున్నాను, జట్టు విజయానికి ఎంతవరకు తోడ్పడుతున్నాను అనేదే ముఖ్యం.
నా దృష్టి అంతా దానిపైనే ఉంది. ఈ గోల లేకపోతే మజా ఉండదు. నా పని మైదానం లోపల, వారి పని మైదానం వెలుపల ఉంటుంది’ అని రోహిత్ పేర్కొన్నాడు. బ్యాట్‌తో రాణించడం, దేశానికి ప్రాతినిధ్యం వహించడమే తన బాధ్యత అని హిట్ మ్యాన్ వెల్లడించాడు. ‘వన్డేల్లో 12 వేల పరుగుల మైలురాయికి చేరువలో ఉన్నా. తీవ్ర ఒత్తిడిలో చేసిన ఈ 34వ వన్డే సెంచరీ నా అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటి.
ఇంగ్లండ్‌లో ఆడటం నాకు ఎప్పుడూ ఇష్టమే. ఇక్కడి వాతావరణం, పిచ్‌లు ఆటగాళ్లకు భిన్నమైన సవాళ్లు విసురుతాయి. ఒక క్రికెటర్‌గా నేను అలాంటి సవాళ్లనే కోరుకుంటాను. నా కెరీర్‌లో కోహ్లీతో కలిసే ఎక్కువగా ఆడా. మైదానంలో అతనితో కలిసి బ్యాటింగ్ చేయడం ఎప్పుడూ ఆనందాన్ని ఇస్తుంది. మా మధ్య మంచి అవగాహన ఉంది. ఆలోచనలను పంచుకుంటూ బ్యాటింగ్ చేస్తాం’ అని రోహిత్ వివరించాడు.
