సంగారెడ్డి: కూతురికి వీడియో కాల్ చేసి మంజీరా నదిలో దూకి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. నారాయణఖేడ్ డిపోలో ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్న పాపయ్య (49) శనివారం (ఫిబ్రవరి 21) న్యాల్కల్ మండలంలోని చాల్కి దగ్గర మంజీరా నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
నదిలో దూకే ముందు కూతురికి వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు నది ఒడ్డున పాపయ్య దుస్తులు, బైకు గుర్తించి గాలించారు పోలీసులు. నదిలోంచి మృతదేహాం వెలికితీసి పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పాపయ్య స్వగ్రామం ఝరాసంగం మండలం కుప్పా నగర్‌గా గుర్తించారు పోలీసులు. పాపయ్య కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హద్నూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వివిధ కోణాల్లో పాపయ్య సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు ఆరా తీస్తున్నారు.
