రాయల్స్‌‌‌‌‌‌‌‌కు మరో షాక్..వరుసగా నాలుగో ఓటమి

రాయల్స్‌‌‌‌‌‌‌‌కు మరో షాక్..వరుసగా నాలుగో ఓటమి
  •    5 వికెట్లతో గెలిచిన పంజాబ్‌‌‌‌‌‌‌‌
  •     కరన్ ఆల్‌‌‌‌‌‌‌‌రౌండ్ షో

గువాహతి : తొమ్మిది మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో ఎనిమిది విజయాలతో టాప్‌‌‌‌‌‌‌‌ గేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దూసుకొచ్చిన రాజస్తాన్ రాయల్స్‌‌‌‌‌‌‌‌ లీగ్ దశ చివర్లో నిరాశ పరుస్తోంది. వరుసగా నాలుగో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఓడి డీలా పడింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌‌‌‌‌‌‌‌ బెర్తు ఖాయం చేసుకున్నప్పటికీ టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌తో నాకౌట్‌‌‌‌‌‌‌‌కు వెళ్లే అవకాశాన్ని చేజార్చుకుంది. నాకౌట్ రేసు నుంచి ఎప్పుడో  తప్పుకున్న పంజాబ్ కింగ్స్.. రాయల్స్‌‌‌‌కు షాకిచ్చి ఊరట విజయం సాధించింది. కెప్టెన్​ సామ్ కరన్ (2/24; 41 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 63 నాటౌట్‌‌‌‌‌‌‌‌) ఆల్‌‌‌‌‌‌‌‌రౌండ్ షోతో  బుధవారం జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఐదు వికెట్ల తేడాతో రాజస్తాన్‌‌‌‌‌‌‌‌ను ఓడించింది.

టాస్ నెగ్గి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన రాజస్తాన్ 20 ఓవర్లలో 144/9 స్కోరు చేసింది. రియాన్ పరాగ్ (34 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 6 ఫోర్లతో 48), అశ్విన్ (19 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌తో 28) తప్ప మిగతా బ్యాటర్లు నిరాశ పరిచారు. పంజాబ్ బౌలర్లలో సామ్ కరన్‌‌‌‌‌‌‌‌, హర్షల్ పటేల్‌‌‌‌‌‌‌‌, రాహుల్ చహర్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో పంజాబ్ కింగ్స్‌‌‌‌‌‌‌‌18.5 ఓవర్లలో 145/5 స్కోరు చేసి గెలిచింది. అవేశ్‌‌‌‌‌‌‌‌, చహల్ చెరో రెండు వికెట్లు తీశారు. కరన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు. 

పరాగ్‌‌‌‌‌‌‌‌ ఒక్కడే

భారీ బ్యాటింగ్ లైనప్ ఉన్న రాజస్తాన్‌‌‌‌‌‌‌‌ను  తక్కువ స్కోరుకే నిలువరించడంలో పంజాబ్ బౌలర్లు సక్సెస్ అయ్యారు. ఇన్నింగ్స్ మొత్తంలో రెండు సిక్సర్లు కొట్టిన రాయల్స్  మొదటి నుంచే తడబడింది. రియాన్ పరాగ్ పోరాటంతో  ఆ మాత్రం స్కోరు చేసింది. తొలుత ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4) ఇన్నింగ్స్ నాలుగో బాల్‌‌‌‌‌‌‌‌కే కరన్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో బౌల్డ్ అయ్యాడు. మరో ఓపెనర్ టాప్ కోహ్లెర్ (18), సంజు శాంసన్ (18) షాట్లు ఆడలేకపోవడంతో  పవర్ ప్లేను రాయల్స్‌‌‌‌‌‌‌‌ 38/1తో ముగించింది. స్పీడు పెంచే ప్రయత్నంలో  వరుస ఓవర్లలో ఈ ఇద్దరూ ఔటవడంతో 42/3తో ఇబ్బందుల్లో పడింది.

ఈ దశలో లోకస్ స్టార్ రియాన్ పరాగ్ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. అతనికి అశ్విన్ మంచి సపోర్ట్ ఇచ్చాడు. చహర్ వేసిన 12వ ఓవర్లో అశ్విన్ 6, 4, 4 కొట్టి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌కు ఊపు తెచ్చాడు. కానీ, తర్వాతి ఓవర్లోనే అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్ అతడిని ఔట్ చేసి  నాలుగో  వికెట్‌‌‌‌‌‌‌‌కు 50 రన్స్ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ బ్రేక్ చేశాడు. ఇక్కడి నుంచి పంజాబ్ బౌలర్లు మరింత విజృంభించారు. కరన్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో ధ్రువ్ జురెల్ (0) గోల్డెన్ డకౌటవ్వగా.. హిట్టర్ రోవ్‌‌‌‌‌‌‌‌మన్ పావెల్ (4) చహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రిటర్న్ క్యాచ్ ఇవ్వడంతో 102/6తో రాజస్తాన్ మరింత డీలా పడింది.

అయితే రియాన్ పరాగ్ ఒంటరి పోరాటం కొనసాగించాడు. అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో రెండు ఫోర్లు కొట్టాడు. తర్వాతి బాల్‌‌‌‌‌‌‌‌కే అతనిచ్చిన రిటర్న్‌‌‌‌‌‌‌‌ క్యాచ్‌‌‌‌‌‌‌‌ను బౌలర్ వదిలేయడంతో బతికి పోయాడు.  డొనోవాన్ ఫెరీరా (7)ను 18వ ఓవర్లో హర్షల్ పెవిలియన్ చేర్చగా.. ఎలిస్ వేసిన 19వ ఓవర్లో ట్రెంట్ బౌల్ట్‌‌‌‌‌‌‌‌ (12) వరుసగా రెండు ఫోర్లతో ఆకట్టుకున్నాడు. హర్షల్ వేసిన ఆఖరి ఓవర్లో పరాగ్ ఎల్బీ, బౌల్ట్‌‌‌‌‌‌‌‌ రనౌటవ్వగా ఆరే రన్స్ వచ్చాయి. దీంతో రాజస్తాన్ 150 మార్కు కూడా అందుకోలేకపోయింది.

కరన్ కెప్టెన్ ఇన్నింగ్స్

చిన్న టార్గెట్ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో  పంజాబ్ కింగ్స్‌‌‌‌‌‌‌‌ కూడా తడబడింది. టాపార్డర్ బ్యాటర్లు నిరాశ పరిచినా కరన్ పట్టుదలగా ఆడి జట్టును గెలిపించాడు. తొలుత ఇన్నింగ్స్ నాలుగో బాల్‌‌‌‌‌‌‌‌కే ప్రభ్‌‌‌‌‌‌‌‌సిమ్రన్ సింగ్‌‌‌‌‌‌‌‌ (6)ను ఔట్ చేసిన ట్రెంట్ బౌల్ట్ రాజస్తాన్‌‌‌‌‌‌‌‌కు బ్రేక్ ఇచ్చాడు.  మరో ఓపెనర్ బెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టో (14)తో కలిసి వన్‌‌‌‌‌‌‌‌ డౌన్ బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలీ రొసో (22) ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. బౌల్ట్‌‌‌‌‌‌‌‌, సందీప్ శర్మ ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టాడు. కానీ, ఐదో ఓవర్లో  మూడు బాల్స్‌‌‌‌‌‌‌‌తేడాతో రొసోతో పాటు శశాంక్ సింగ్ (0) వికెట్లు తీసిన అవేశ్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ పంజాబ్‌‌‌‌‌‌‌‌ను దెబ్బకొట్టాడు. ఆపై చహల్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో  భారీ షాట్‌‌‌‌‌‌‌‌కు ట్రై చేసిన బెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టో బౌండ్రీ లైన్ వద్ద పరాగ్‌‌‌‌‌‌‌‌కు చిక్కాడు.

దాంతో పంజాబ్ 8 ఓవర్లకు 48/4తో ఎదురీత మొదలు పెట్టింది. ఈ దశలో  కెప్టెన్ కరన్, జితేశ్‌‌‌‌‌‌‌‌ శర్మ (22) ఇన్నింగ్స్ బాధ్యత తీసుకున్నారు. అశ్విన్ ఓవర్లో జితేశ్‌‌‌‌‌‌‌‌ సిక్స్ కొట్టగా.. కరన్ వెంటవెంటనే మూడు ఫోర్లతో ఛేజింగ్‌‌‌‌‌‌‌‌కు మళ్లీ ఊపు తెచ్చాడు. అశ్విన్ వేసిన 15 ఓవర్లో చెరో సిక్స్‌‌‌‌‌‌‌‌తో స్కోరు వంద దాటించారు. విజయానికి 34 రన్స్ అవసరమైన దశలో  జితేశ్‌‌‌‌‌‌‌‌ ఔటవడంతో ఐదో వికెట్‌‌‌‌‌‌‌‌కు 63 రన్స్ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ బ్రేక్ అయింది. సందీప్, అవేశ్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో కరన్ రెండు సిక్సర్లు కొట్టగా.. అషుతోశ్ (17 నాటౌట్‌‌‌‌‌‌‌‌) 6, 1తో మ్యాచ్ ముగించాడు.  

సంక్షిప్త స్కోర్లు

రాజస్తాన్ : 20 ఓవర్లలో 144/9 (రియాన్ పరాగ్ 48, అశ్విన్ 28,  కరన్ 2/24, చహర్ 2/26)
పంజాబ్ : 18.5 ఓవర్లలో 145/5 (కరన్ 63*, రొసో 22, అవేశ్‌‌‌‌‌‌‌‌ 2/28, చహల్ 2/31)